Sunday, April 14, 2024

వడ్డెర చండీదాస్ నవలలు

నేను చిన్నప్పుడు చాలా తెలుగు నవలలు చదివాను కానీ, వడ్డెర చండీదాస్ గురించి ఎప్పుడు వినలేదు. అందువల్ల చదివే అవకాశం అసల్లేదు. తెలుగు బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పటినుంచే ఇతని గురించి వింటున్నాను. అయినా పెద్దగా చదవాలనిపించలేదు. కానీ ఈమధ్య అతని నవల అనుక్షణికం పరిచయం చదివాక ఎందుకో చదివి చూడాలనిపించింది. అనుక్షణికం, హిమజ్వాల కొని అనుక్షణికం పూర్తిచేశాను.

ఈ నవలకు అనుక్షణికం అనేకన్నా పరాజితులు అని పెడితే సరిపోతుందేమోననిపించింది. ఎవరో ఒకటి రెండు పాత్రలు తప్ప మిగిలినవన్నీ ఫెయిల్ అయిన జీవితాలే. సరే ఫెయిలో పాసో మనం చూసే దృష్టి బట్టి ఉందనుకోండి. 

ఈ నవల వ్రాసిన కాలానికి పాత్రల చిత్రీకరణ, వర్ణనలు కొద్దిగా విప్లవాత్మకమేమో. కొన్ని కొన్ని వర్ణనలు పెద్ద పెద్ద పేరాగ్రాఫ్ లాగా ఉండడంతో మొదట్లో చదివినా తర్వాత్తర్వాత కొన్ని కొన్ని చదవలేదు. మరీ ఎక్కువ కవితాత్మకంగా / (ఆధ్యాత్మికంగా?) అనిపించాయి :)

ఇది చదివిన తర్వాత హిమజ్వాల మొదలుపెట్టాను కానీ కొన్ని పేజీలు చదవంగానే అది మరీ అసహజంగా అనిపించి ఆపేశాను. 

అనుక్షణికం అంత గొప్పగా అనిపించలేదు అలాఅని మరీ చెత్తగా కూడా లేదు. హిమజ్వాల పూర్తిగా చదవలేదు. ఎప్పుడైనా సమయం దొరికితే చూడాలి. 


అనుక్షణికం మొదలుపెట్టకముందు ది అల్కెమిస్ట్ మళ్ళీ చదువుదామనిపించి తీసాను. మొదటిసారి చదివినప్పుడు, "మొదటిసారి చూసినప్పుడద్దరాతిరి చూసుకున్నచూపులన్ని అదోమాదిరి" అన్నట్టు అసలు కథేంటో తెలుసుకోవాలన్న ఉత్సాహంలో ఆ ఫిలాసఫీ అర్ధం చేసుకోడానికి ప్రయత్నించలేదు. మొదటి కొన్ని పేజీలే చదివాను కానీ చాల ఆసక్తికరంగా అనిపించింది. అందులో కథానాయకుడు శాంటియాగో క్రొత్త పుస్తకం తీసుకునే ఆలోచనల్లో అనుకునేదేమిటంటే పుస్తకంలో ఎక్కువ పేజీలుండాలి, ఎక్కువరోజులు చదవచ్చు, ఆ తర్వాత పుస్తకం మొదట్లోనే అన్ని పాత్రలను ప్రవేశపెట్టకూడదని. ఆ తర్వాత అనుక్షణికం చదివినప్పుడు అదే అనిపించింది మొదట్లోనే బోళ్ళన్ని పాత్రలు వచ్చేస్తాయి. 

 ది అల్కెమిస్ట్ మళ్ళీ పూర్తి చేసినతర్వాత ఎలా అనిపించిందో వ్రాస్తాను. 

 

~సూర్యుడు :-)

Saturday, March 9, 2024

కణ విభజన

కణ విభజనే, తమిళ్లో క, గ ఒకటే కాబట్టి, పొరపాటున గణ విభజన అనుకోవద్దు :D


మానవ శరీరమంతా కణమయం కాబట్టి, నిరంతరం కణాలు ఒక పద్దతిలో విభజింపబడుతూ ఉంటాయని చదువుకున్నాముకదా. మరి అవి ఓ పద్ధతిప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు విభజింపబడితే ఏమంటాం?


అలాగే, పట్టణాలుకూడా. ఒక క్రమ పద్దతిలో పెరిగితే అందము చందమూనూ. అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు పెరిగితే ఏమౌతుంది?

 

అసలు టౌన్ ప్లానింగ్ అనే కార్యాలయమొకటుందా?

 

~సూర్యుడు :-)

Wednesday, February 28, 2024

త్యాగరాజ పంచరత్నాలు

త్యాగయ్య వారి పంచ రత్న కీర్తనలు వరుసలో
  1. జగదానందకారక - నాట రాగం
  2. దుడుకుగల నన్నే - గౌళ రాగం
  3. సాధించనే ఓ మనసా - అరభి రాగం
  4. కనకనరుచిరా - వరాళి రాగం
  5. ఎందరోమహానుభావులు - శ్రీ రాగం

Courtesy:  త్యాగరాజ పంచరత్నాలు

ప్రశ్న ఏంటంటే, త్యాగరాజులవారు అన్ని కృతులు వ్రాసినా వీటినే ఎందుకు పంచరత్నాలన్నారు?

మీకేమైనా తెలుసా?


~సూర్యుడు :-)

Thursday, February 15, 2024

మొబైల్ నంబర్లు

 సాధారణంగా రెండు రకాలు, ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్. నాకెందుకో ప్రీపెయిడ్ అంత నచ్చదు. ఈ మధ్య ఓ పోస్ట్ పెయిడ్ నంబర్ తీసుకున్నా. యాక్టివేట్ చేసిన కొన్ని గంటలకే ఎస్సెమ్మెస్సులు రావడం మొదలుపెట్టాయి. మొదటి ఎస్సెమ్మెస్ చదవంగానే నిద్రమత్తు మొత్తం దిగిపోయింది. ఎదో ఎటిఎం లో కార్డు ట్రాన్సాక్షన్ deny చెయ్యబడింది. అరే నా డెబిట్ కార్డు ఏదైనా పోయిందా లేక హ్యాక్ అయ్యిందా అని బుఱ్ఱ (అదే తల) తిరిగింది. నిద్ర మత్తు మొత్తం వదలంగానే అర్ధమయ్యిందేమిటంటే అది నా కార్డు కాదు వేరే వాళ్లదని. 

 కట్ చేస్తే, నా కొత్త నంబరు తాలూకా పాత ఓనరు, ఈ  నంబర్ని బ్యాంకుల్లో రిజిస్టర్ చేసుకుని, డీలింక్ చెయ్యకుండా మొబైల్ నంబర్ని వదిలేసుకున్నాడు. దానితో ఆ నంబరు తీసుకున్న నాకు అతని మెస్సేజులు రావడం మొదలుపెట్టాయి. అతని కార్డు ట్రాన్సక్షన్స్ అన్నీ  నాకు తెలుస్తున్నాయి, ఎన్ని సార్లు ట్రాన్సాక్షన్ deny చెయ్యబడింది, అలాగే ఎన్ని సార్లు ట్రాన్సాక్షన్ ఆనర్ అయి ఇంకా ఎంత బాలన్స్ ఉంది etc. ఇది అతనికి పెద్ద ప్రైవసీ లేదా సెక్యూరిటీ సమస్య కాకపోవచ్చు కానీ నాకు తలనొప్పిగా అనిపించింది. దీనికి తోడు ఇది నువ్వేనా అని అతని పాత సహచరుల ఫోన్లు. 

ఈ గోల భరించలేక, కస్టమర్ కాల్ సెంటర్ కి ఫోన్ చేసి మీరేమైనా చెయ్యగలరా అంటే మా వల్ల కాదన్నారు. మీరే ఆ బ్యాంకులన్నిటికీ వెళ్ళి ఈ  నంబర్ని పాత అకౌంట్ నుండి తప్పించమని అడగమన్నారు. నేనేమీ "అతడు" లో మహేష్ బాబు ని కాదుకదా ఓ గన్ తీసి బెదిరించడానికి. సరే వీళ్ళకి నా సమస్య అర్ధమైతేనే కానీ లాభం లేదని రోజుకోసారి ఫోన్ చేసి విసికిస్తే ఇంక లాభంలేదని మా ఆఫీస్ కి వెళ్లి మాట్లాడండన్నారు. అక్కడ కూడా మేమేమీ చేయలేమని చెప్పి, ఒకే ఉపాయమేంటంటే, ఈ నెంబర్ ఇచ్చేసి ఇంకొక కొత్త నెంబర్ తీసుకోవడం. సరే అని ఆ పాత నంబర్ని సమర్పించి కొత్త నెంబర్ తీసుకున్నాను. 

నా గోలను ప్రక్కనపెడితే, ఈ సెల్ ఫోన్ల ఆపరేటర్లకు recycle అయ్యే నంబర్లను sanitize చేయడానికో విధానం/ప్రక్రియ లేదు. మొబైల్ నంబర్లే ఆధార్ నంబర్లకంటే ముఖ్యమైన ఈ రోజుల్లో, శానిటైజ్ చెయ్యకుండా మొబైల్ నంబర్లను వేరే వాళ్లకు ఇవ్వడం ఎంతవరకు సముచితం?

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ వచ్చినతరువాత మొబైల్ నెంబర్ నే ఆధార్ నెంబర్ చేసేస్తే పోయేది. 

మీరేమంటారు ?


~సూర్యుడు :-)

Sunday, January 14, 2024

మనతోనే ఉండే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం

అంటే ఇదేమీ కొత్తకాదుగానీ, మనమేదైనా కంప్యూటర్ వాడుకోవాలంటే ఒక సిస్టం అందులో ఆపరేటింగ్ సిస్టం కావలికదా. లినక్సు లాంటి ఆపరేటింగ్ సిస్టం ఇంతకుముందు డీవీడీ రైటర్ వాడి ఇన్స్టాల్ చేసేవారు . ఆతర్వాత USB స్టిక్స్ వాడి చేస్తున్నారు. అదే లైవ్ ఇమేజ్ ఐతే, ఇన్స్టాల్ చెయ్యకుండా బూట్ చేసి వాడుకున్నంతసేపు వాడుకుని తర్వాత సిస్టం నుంచి తీసేసుకోవచ్చు. ఈ  USB స్టిక్ ని ఎక్కడికి కావాలంటే అక్కడకు తీసుకెళ్లవచ్చు. మనక్కావలసిందల్లా ఒక సిస్టం, బూట్ చెయ్యడానికి (USB స్లాట్ ఉండాలనుకోండి). 

కానీ ఇక్కడో చిక్కుంది. సిస్టం లో అయితే ఆపరేటింగ్ సిస్టం ని అప్డేట్ చేస్తూ ఉండొచ్చు కానీ USB స్టిక్ లో ఇమేజ్ ని అప్డేట్ చెయ్యడానికి లేదు. బూట్ అయిన ఇమేజ్ ని అప్డేట్ చేసినా అది నడుస్తున్నంతవరకే పనికొస్తుంది కానీ మళ్ళీ బూట్ చెస్తే పాత ఇమేజ్ బూట్ అవుతుంది. ఏమైనా కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా అది USB స్టిక్ ఇమేజ్ లో అప్డేట్ అవ్వదు. 

కానీ ఈ ఆపరేటింగ్ సిస్టం వాళ్ళు ఒక ఫీచర్ ఆడ్ చేస్తే, అంటే లైవ్ ఇమేజ్ ని USB  స్టిక్ నుండి బూట్ చేసి దాన్ని అప్డేట్ చేసినా, కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా, షట్ డౌన్ చేసేటప్పుడు ఈ కొత్త ఇమేజ్ ని USB స్టిక్ లోకి వ్రాసేయమంటావా అని అడిగి, వ్రాసేయ్ అంటే USB స్టిక్ లో కొత్త ఇమేజ్ ని వ్రాసేస్తే, నెక్స్ట్ టైం ఆ USB స్టిక్ వాడి బూట్ చేస్తే , కొత్త ఇమేజ్, అంటే అప్డేటెడ్ సాఫ్ట్వేర్ కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ వస్తే ఇంకా బాగుంటుంది. బాగుంటుందనేకన్నా సౌకర్యంగా ఉంటుంది :)

 

~సూర్యుడు :-)



Thursday, January 11, 2024

ప్రజాస్వామ్యము - ఓటు హక్కు వినియోగము

ఎన్నికలు వస్తున్నాయనగానే పత్రికల్లోనూ, ప్రచారసాధనాల్లోనూ అందరూ హోరెత్తించేమాట, ఓటుహక్కు ఉన్నవాళ్ళందరూ తప్పకుండా ఓటు వెయ్యాలని. అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని. ఎన్నికలు పూర్తయి ప్రభుత్వ ఏర్పాటు అవ్వకముందునుంచే అవతలి పక్ష ప్రజా (?) ప్రతినిధుల్ని ఎలా కొనేయాలని అన్ని రాజకియపక్షాలు ప్రయత్నిస్తుంటే, ధనానికో మరొకదానికో ఆశపడి ప్రజా ప్రతినిధులు వేరే పక్షానికి దూకేస్తుంటే అది ప్రజాస్వామ్యమని ఎలా అనిపించుకుంటుంది?

ప్రజలు ఒక పక్షానికిచెందిన అభ్యర్థిని గెలిపించినప్పుడు, వారి అభిప్రాయాన్ని కాదని ఆ అభ్యర్థి వేరే పక్షానికి దూకేస్తే అతనికి ఓట్లేసినవారి పరిస్థితేమిటి? వారి ఓటుకున్న విలువేంటి? ఆమాత్రందానికి అందరు ఓటు వెయ్యాలని చెప్పడం దేనికి? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా దాని సంగతే ఎవరు మాట్లాడడం లేదు. ప్రజాస్వామ్యానికే అమ్మలాంటి ప్రజాస్వామ్యమంటే ఇదేనా?

ఇంతకుముందు ఇలా జరగలేదా అని ప్రశ్నించొచ్చు కానీ ఇంతకుముందు జరిగిన తప్పులే మళ్ళీ చేస్తుంటే ఇంక తేడా ఏముంది, పురోగతేముంది?

ఒక్క ఓటుతో గెలిచినా పూర్తికాలం అభ్యర్థిగా కొనసాగే హక్కెలాఉంటుందో ఒక్క సీటు మెజారిటీతో గెలిచినా ఆ పక్షానికి పూర్తి కాలం పరిపాలించే హక్కుండాలి.


మీరేమంటారు?


~సూర్యుడు :-)

Wednesday, January 10, 2024

Problem in commenting on a post in blogspot

Recently, I had a problem in commenting on a post in http://kasthephali.blogspot.com blog. On googling, I found the following link that might be useful to others facing the same problem -


https://support.google.com/blogger/thread/163549939/comments-on-blogger-with-the-sign-in-with-google-button?hl=en


Of course, when you follow the advice, you know what you are doing ;)


~సూర్యుడు :-)