అనగా అనగా ఒకప్పుడు ఓ బోనులో ఓ ఐదు కోతులు, కొద్దిగా ఎత్తులో ఓ తాడుమీద ఒక అరటిపండు, దానికింద ఓ నిచ్చెన, అదెక్కితే అరటిపండు అందేలా.
ఇలా ఉండగా ఓరోజు ఓ కోతి ఆ అరటిపండు చూసింది, నెమ్మదిగా నిచ్చెన దగ్గరకొచ్చి ఎక్కబోయింది, అంతే, మిగిలిన నాలుగు కోతులమీద చల్లటి నీళ్ళు పడ్డాయి.దీంతో అరటిపండుకోసమెళ్ళిన కోతి వెనక్కొచ్చింది. ఇంకొంతసేపటికి, ఇంకొక కోతి ఇలాగే ప్రయత్నించింది, నిచ్చెనమీదకెళ్ళడానికి, మళ్ళీ చల్లటి నీళ్ళు మిగిలిన నాలుగు కోతులమీద పడ్డాయి, దాంతో ఈ కోతి కూదా మళ్ళీ వెనక్కొచ్చింది.
ఈ సారి మరో కోతి నిచ్చెనదగ్గరకెళ్ళడానికి ప్రయత్నించేసరికి, మిగిలిన నాలుగు కోతులు దాన్ని వెళ్ళకుండా అడ్డుకున్నాయి, మళ్ళీ చన్నీళ్ళు పడతాయేమోనని. ఈ పరిస్థితుల్లో, ఆ ఐదు కోతుల్లోనుండి ఓ కోతిని బయటకు తీసుకొచ్చి, ఇంకొక కొత్త కోతిని లోపలకి పంపించారు. ఈ కొత్తకోతి, అరటిపండుకోసం నిచ్చెనదగ్గరకు వెళ్లబోయింది కాని మిగిలిన పాతకోతులు నాలుగు దాన్ని కొట్టడం మొదలుపెట్టాయి, ఈ కొత్త కోతికి ఈ సంగతేమిటో అర్ధంకాలేదు కాని ఆ నిచ్చెనదగ్గరకు వెళ్ళడం మానుకుంది. ఇప్పుడు ఇంకొక పాతకోతి (పాత నాలిగింట్లో ఒకదాన్ని) ని బయటకు తీసుకొచ్చి ఇంకొక కొత్త కోతిని లోపలకు పంపించారు, ఈ కొత్త కోతి కూడా అరటి పండుకోసం నిచ్చెనదగ్గరకెళ్ళబోయింది. మళ్ళీ మిగిలిన నాలుగు కోతులు (ఇంతకుముందే వచ్చిన కొత్త కోతితో సహా) దాన్ని కొట్టడం మొదలుపెట్టాయి. దీంతో ఈ కొత్త కోతికికూడా నిచ్చెనదగ్గరకెళ్ళకూడదని అర్ధమయ్యింది. ఇలా ఒక్కొక్క పాతకోతిని (మొదటి ఐదుకోతులు) బయటకు తీసుకొచ్చి వాటి స్థానాల్లో కొత్తకోతులు లోపలకు ప్రవేశపెట్టపడ్డాయి. ఇలా ఓ కొత్త కోతొచ్చినప్పుడల్లా అరటి పండుకోసం ప్రయత్నించడం, మిగిలినవి దాన్ని కొట్టడంతో అవి ఆ పని విరమించుకోవడంతో, చివరికి పాత ఐదు కోతులు బయటకి వెళ్ళి వాటి స్థానాల్లో కొత్త కోతులొచ్చినప్పటికి, అవి అరటిపండుకోసం ప్రయత్నించడం మాని కూర్చున్నాయి.
సంగతేంటంటే, కొత్తగా వచ్చినకోతులకి ఆనిచ్చెదగ్గరకెళితే ఏమౌతుందో తెలియనప్పటికీ, ప్రయత్నిస్తే దెబ్బలుతింటామని మానేసాయి. ఇదొక ప్రవర్తన నియంత్రణ (బిహేవియరల్ కండిషనింగ్) కు ఉదాహరణ.
ఈ కథ ఇంగ్లీషు మూలాన్ని
ఇక్కడ చదవండి. నా స్వేచ్ఛానువాదంలో తప్పులుంటే మన్నించి తెలుపగలరు :)