Sunday, May 31, 2009

ఆలోచన్లకి భాషుంటుందా?

తెలుగులో ఆలోచించండి « Rayraj Reviews

పై బ్లాగులో రేరాజు గారు ఆలోచన్లు, తెలుగు భాష మీద ఓ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. నావి కూడా ఇంచుమించుగా అవే ఆలోచన్లు కాని కాని కొంతమంది ఆలోచన్లకి భాషేంటి, అలోచన్లు భాషకంటే పురాతనమైనవి అని, అంటే భాషలేనప్పుడు, మానవుడు ఆలోచించాడు కాబట్టి ఆలోచన్లకి భాషేంటి అన్నారు.

నా అభిప్రాయం:

ఆలోచన్లకి భాషుంటుంది. ఉదాహరణకి, ఆ వ్యాఖ్యలు చదవంగానే నాకు ఆలోచన్లు ఇలా వచ్చాయి, "అదేంటి ఆలోచన్లుకి భాషలేదంటారు, నేను రోజూ ఇంటినుండి ఆఫీసుకి, ఆఫీసునుండి ఇంటికి వెళ్లేటప్పుడు, ఏదో ఒక భాషలోనే ఆలోచిస్తుంటాను కదా అని" ఇవి నా యధాతధ ఆలోచన్లు. ఆలోచించే విషయాన్ని బట్టి, సందర్బాన్ని బట్టి, ఆలోచన్ల భాష మారిపోతుంటుంది :-)

వేరే సందర్బంలో చెప్పినా ఎవరో కవిగారిలా అన్నారు : "మనసుమూగదేకాని బాసుంటది దానికి ..." అని ;)

ఎవరో పార్లమెంటులో ఎప్పుడో నెహ్రూ గారిని విమర్శిస్తూ ఇలా అన్నారుట, "నెహ్రూ గారు కలలుకూడా ఇంగ్లీషులోనే కంటారని" (మళ్లీ గాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించకండి ;)). అంటే సబ్కాన్షియస్ మైండ్‌కికూడా ఓ భాషుంటుంది. నెహ్రూ గారి (అన్నట్లు ఈ మధ్యనే నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియా కొన్నాను, సమయం చూసుకుని చదవాలి) సంగతెలాఉన్నా, మా చిన్నమ్మమ్మగారు టాటా (జెంషెడ్పూర్)లో స్థిరపడి అప్పుడప్పుడు మాఇంటికొచ్చినప్పుడు  రాత్రుళ్లు హిందీలో పలవరించేవారు :-)

నా ఉద్దేశ్యంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ కి, మన నాచురల్ లాంగ్వేజస్ కి పెద్దగా తేడాలేదు. ఒకటి కంప్యూటర్‌కి అర్ధమవ్వడంకోసమైతే ఇంకొకటి మనుషులకర్ధమవ్వడానికి.

మరి, కంప్యూటర్ లాంగ్వేజస్‌ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుంటారు, అలాగే ఇంగ్లీష్‌నికూడా, నిన్ననే ఎవరో చెప్పారు, ఇప్పుడు హిందీ "అచ్చా" ని ఇంగ్లీష్ పదంకింద ఏదో డిక్షనరీలో కలిపారని (గూగుల్లో వెతికా కాని దొరకలేదు).  అలా తెలుగునెప్పుడైనా ఆధునీకరించారా? ఏమైనా క్రొత్త తెలుగు పదాలు జతచేస్తున్నారా?

కొన్ని శంకలు:
మాఁవ సరైనదా లేక మావఁ సరైనదా? అలాగే సీఁవ లేక సీవఁ? అరసున్న ప్రావీణ్యులెవరైనా కొద్దిగ సరిచేస్తారా?

మొత్తానికి వాతావరణశాఖవారు చెప్పినట్లు ఋతుపవనాలు బెంగళూరులోకి ప్రవేసించాయి :-) చెట్లన్నీ (మాఇంట్లో చెట్లు, నేనుకూడా అనుకోండి) మోదంతో ఋతుపవనాల్ని ఆహ్వానించేశాయి :-)

~సూర్యుడు :-)



 


Saturday, May 30, 2009

సాంగత్యం

ఈ మధ్య ఎందుకు కొందరు వ్రాసినవి నచ్చి, ఇంకొందరు వ్రాసినవి నచ్చట్లేదు అని ఆలోచిస్తుంటే నాకనిపించిందేంటంటే, ఆలోచించే విధానంలో తేడాలని. కొంతమంది వ్రాసినవి చదువుతుంటే ఈయనెవరో మనలాగే ఆలోచిస్తున్నారే అనో లేదా మనుషులు ఇలాక్కూడా ఆలోచిస్తారా అని.

ఈయనెవరో మనలాగే ఆలోచిస్తున్నారే అనిపించకపోయినా, ఈయనెవరో బాగాచెప్తున్నారే అనిపించిందంటే, వారి వారి ఆలోచనావిధానమొకలా ఉందన్నమాట. ఈ విధంగా ఒకలాగే ఆలోచించే విధానంలోకూడా కొద్దిగా తేడాలు, ఆ తేడాలు శూన్యమైతే బాగా నచ్చిపోతుంటాయి, తేడాలు పెరిగి 90 డిగ్రీలకొచ్చెస్తే (టాంజెన్షియల్), నచ్చటం తగ్గిపోయి, ఏమీ అనిపించదు, అంటే మంచి అభిప్రాయమూకాదు, అలా అని చెడు అభిప్రాయమూకాదు (నాకు బ్లాగుల్లో కవితలు చూస్తే వచ్చే అనుభూతి, ఆనందిద్దామా అంటే అర్ధంకావు అలాఅని చిరాకూ తెప్పించవు). చదివితే చదువుతాము, లేకుంటే లేదు కాని చదివినా వ్యాఖ్య వ్రాయాలనిపించదు.

వ్యాఖ్య = కొసైన్ (ఆలోచనలలో తేడా డిగ్రీలలో)

తేడా శూన్యమైతే, వ్యాఖ్య చాలాబాగుందనో, అదిరిందనో, సూపరో, సెహబాసో :-)

తేడా 90 డిగ్రీలదాకా వచ్చిందనుకోండి, అప్పుడు, వ్యాఖ్యలుండవు, ఊరికే హిట్లే ;)

తేడా 180 డిగ్రీలదాకావస్తే, వీళ్లు మనకి సరిగ్గా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఇలాంటి రాతలు చదవకపోతే పర్వాలేదుకాని, చదివింతర్వాత వ్యాఖ్య వ్రాయకుండా ఉండడం కష్టమే, మరి ఆ వ్యాఖ్య, ఇది పరమచెత్తనో, లేకపోతే పాదాలకి ఒక ఫొటోతీసి స్కాన్ చేయించి బ్లాగులో పెట్టమనో ఉంటాయి ;)

పై వివరణంతా హేతువాదులకి, గతితార్కిక భౌతికవాదులకి (అసలు ఇదంటే ఏంటో నాకు తెలీదు, గతి తప్పిన తర్కం చేసేవాళ్లనా ? ;))

ఇక నాలాంటి మామూలు (అల్ప)మానవులకోసం :-)

సూర్యమానంలో పన్నెండు రాశులుంటాయి కదా, వాటిని గాలి, నిప్పు, నీరు, మట్టి అని నాలుగు రకాలుగా విభజించారు కదా. ఈ ఒక్కొక్క రకంలో మూడేసి రాశులుంటాయి. నేను చదివిన (లిండా గుడ్‌మ్యాన్) సన్‌సైన్స్ లో ఏంచెప్పారంటే, గాలి వాళ్లు నిప్పు వాళ్లు బాగా కలుస్తారని (గాలి + గాలి, గాలి + నిప్పు) అలాగే నీరు, మట్టి. దీనిబట్టి, గాలివాళ్లు టపాలు వ్రాస్తే వేరే గాలివాళ్లకి బాగా నచ్చడమైనా అవుతుంది లేదా ఏమీ అనిపించకపోవచ్చు. అలాగే నిప్పు వాళ్లతోకూడా :-) (డిట్టో, నీరు + మట్టి)

ఒకవేళ మట్టివారు టపా వ్రాస్తే, గాలి వాళ్లకి, నిప్పు వాళ్లకి అసలు నచ్చకపోవచ్చు ;) అలాగే నీల్లవాళ్లతోకూడా. ఇలా ఆలోచన్లు కలవడం, కలవకపోవడాన్నే కంపాటబిలిటీ (సాంగత్యం) అంటారు :-). ఎక్కువరోజులు కలిసి ఉండవలసిన పెళ్లికైతే ఇవన్నీ చూసుకుంటారు కాని, బ్లాగులు చదువుకోడానికి, ఉద్యోగాలు చేసుకోడానికి, కంపాటబిలిటీలు చూసుకోవడం కుదరదు కదా ;) మరందుకే అలాంటి వ్యాఖ్యలు ;)


ప్రస్తుతానికింతే, నాకు బురదంటే నచ్చదు ;)

~సూర్యుడు :-)

Wednesday, May 27, 2009

బెంగళూరు అందాలు

బె ంగళూరులో కొన్ని సంవత్సరాలనుండి ఉంటున్నా ఎప్పుడూ గమనించలేదు ప్రత్యేకంగా కాని ఈ సంవత్సరమెందుకో అలా అనిపిస్తోంది. బెంగళూరులో నాకు ముఖ్యంగా నచ్చినవి చెట్లు. అందులోనూ దక్షిణ బెంగళూరులో పసరిక ఎక్కువగా ఉంటుంది. నేనుండే ప్రదేశమక్కడే.

ఎన్.ఆర్ కోలనీ ప్రధాన రహదారికి అటు-ఇటు చెట్లు భలే ఉంటాయి. అవి ఏ వృక్షాలో తెలీదు కాని, చాలా పెద్దవిగా పెరుగుతాయి. వేసవి ముందే చక్కగా చిగిర్చి మంచి నీడనిస్తాయి. కొన్ని కొన్ని కూడళ్ల వద్ద అసలు ఎండే కనిపించదు వీటివల్ల. అలాగే జైన్ కాలేజ్ రోడ్లో, సౌత్ ఎండ్ సర్కిల్ నుండి జె.పి నగర్ వెళ్లే రోడ్డు అద్భుతం. కార్పొరేషన్ (హడ్సన్) సర్కిల్ నుండి కబ్బన్ పార్క్ మెయిన్ గేట్ వరకు (కస్తూర్బా) రోడ్డు గురించి చెప్పనక్కర్లేదు.

అలాగే, మార్చి వెళ్లి ఏప్రిల్ వస్తుండగా ఒకరకమైన చెట్లు పసుపురంగు పువ్వులు పూస్తాయి. ఇవి దాదాపుగా అన్ని రోడ్లమీదా కనిపించినా, కస్తూర్బా రోడ్లో, వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీకి విశ్వేశరాయ మ్యూజియమ్‌కి మధ్యలో బోలెడు ఉంటాయి. ఆసలు ఒక్క ఆకూ లేకుండా మొత్తం పువ్వులు పూస్తుందీ చెట్టు.

ఏప్రిల్ వెళ్తూ మే వస్తుండగా గుల్‌మొహర్ చెట్లు ఆకుపచ్చని ఆకుల మధ్యలో ఎర్రని పువ్వులు పుస్తూ భలే ఉంటాయి. ఇన్నిరోజులున్నా గమనించని ఈ అందాలు ఈ మధ్యనే, "నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో ... పూసిన ప్రతి పూవొక వధువు ... " అన్న టైపులో కనిపిస్తున్నాయి :-)

ప్రస్తుత ఈ టపాకి (ఎర్ర పువ్వులు పూస్తున్న) గుల్‌మొహర్ చెట్లే ప్రేరేపణ ...

~సూర్యుడు :-)

Saturday, May 23, 2009

సన్మానం

చివరికి జరగవలసిన సన్మానం జరిగింది. ఏంటి / ఏటి ఇంకా ఎవరూ ఇలా అనట్లేదా అని అనుకుంటుంటే తా.బా.సు గారు చెప్పేసారు, బాబూ నా బ్లాగుకు రావద్దు, వచ్చినా చదవద్దు, పొరపాటున చదివినా వ్యాఖ్యలు వ్రాయొద్దు, ఇంతచెప్పినా వినకుండా వ్యాఖ్యలు వ్రాసినా అవి తొలగింపబడతాయని :-)

అసలు సంగతేంటంటే, ఆయన వ్రాసేవేవీ నాకు నచ్చవు. ఎందుకో తెలీదు కాని నచ్చవు. తరచుదనం / తరంగదైర్ఘ్యం లో తేడాలేమో? ఈ సంగతి తెలిసినా సరే చదివిన తర్వాత ఒక్కోసారి వ్యాఖ్య వ్రాయకుండా ఉండలేం (వీకునెస్సు).

ఇంతకుముందెప్పుడో ఓ టపాలో వ్రాసుకున్నా, ఒక్కొక్కరి అభిప్రాయాలు అవతలవారికి ఎలా అర్ధమౌతాయో, అర్ధంకావో అని. ఒకరికి ఒకరకంగా అనిపించింది వేరే వాళ్లకి వేరేరకంగా ఎలా అనిపిస్తుందో అని. ఉద్యోగంలో చేరిన క్రొత్తలో సీనియర్లు చెప్పేవారు, మెయిల్స్ పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంగ్లీష్ చాలా చిత్రమైన భాష, మనం అనుకున్నది వేరే వారికి అలానే అనిపించకపోవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి వ్రాయాలని. ఈ సమస్య ఇంగ్లీష్‌కే కాదు, తెలుగుకి కూడా ఉందేమో అనిపిస్తోంది...

ఉదాహరణకి మొన్నెప్పుడో, పర్ణశాల బ్లాగులో ఓ వ్యాఖ్య ఇలా వ్రాశాను:
"నేర్చుకునే అలవాటుంటే దేన్నుంచైనా నేర్చుకోవచ్చు ;)

రామాయణం ఒక ఫ్రేం‌వర్క్. చరిత్ర అనుభవాలు. ఫ్రేం‌వర్క్ ని ఫాలో అవ్వాలి, అనుభవాలనుంచి నేర్చుకోవాలి :-)"

ఇందులో రెండో లైను చూడండి, నా ఉద్దేశ్యం రామాయణం ఒక ఫ్రేం‌వర్క్ లాంటిది, చరిత్ర అనుభవాలు లాంటిది అయితే, ఫ్రేం‌వర్క్ ని ఫాలో అవ్వాలి, అనుభవాలనుండి నేర్చుకోవాలని. ఫ్రేం‌వర్క్ వేరు, అనుభవాలు వేరు అయితే ఈ వ్యాఖ్యకి మహేష్‌కుమార్ గారి స్పందన ఇలా:
"కాబట్టి ఈ ఫ్రేంవర్క్ అనుభవాలలో నేర్చుకోవడానికి ఏమీ లేదు." (నాకు కావలసినంతవరకే తీసుకున్నా). దీనిబట్టి నాకర్ధమయ్యిందేమిటంటే, నా వ్యాఖ్య సరిగ్గా చేరలేదు. ఒకవేళ నేను క్రింద విధంగా వ్రాసుంటే:
"రామాయణం ఒక ఫ్రేం‌వర్క్ - చరిత్రేమో అనుభవాలు. ఫ్రేం‌వర్క్ ని ఫాలో అవ్వాలి, అనుభవాలనుంచి నేర్చుకోవాలి" ఇంకొద్దిగా స్పష్టంగా ఉండేదేమో అనిపించింది.

ఎలా అయినా సరే, మనమెంత స్పష్టంగా వ్రాసినా సరే, అందరి ఆలోచనా విధానం ఒకే రకంగా ఉండదు కనుక, ఒకరు వ్రాసినవి అందరికీ నచ్చాలనే రూలేమీలేదు. కానీ అప్పుడు, మీరు చెప్పింది నాకర్ధమయ్యింది కాని, నేను విభేదిస్తున్నాను అని చెప్పొచ్చు :-)

మా తెలుగు మాష్టారు కవుల గురించి ఓ జోక్ చెప్తుండేవారు:

"ఓ సారి ఎవరో ఓ కవి దగ్గరకెళ్లి ఆ కవి వ్రాసిన కవిత చూపించి దానికి అర్ధమేమిటి అని అడిగితే, ఆ కవిగారిలా అన్నారుట; ఆ కవిత వ్రాసే వరకు దానర్ధం ఇద్దరికి తెలుసు, వ్రాసేసిన తర్వాత దానర్ధం ఒక్కడికే తెలుసు అని, వ్రాసేంత వరకు ఆ కవితకి అర్ధం ఆ కవి గారికి మరియు దేవుడికి మాత్రమే తెలుసు, వ్రాసేసిన తర్వాత దానర్ధం ఆ ఒక్క దేవుడికే తెలుసు అని తాత్పర్యం :)"

అలాగే మన తెలుగు బ్లాగుల్లో కూడా కొన్ని టపాలు చదువుతుంటే అర్ధం కావు, అలాఅని పొరపాటున అడిగితే కోపాలు ;) ( ఈమధ్యనే (మా కంపెనీలో) ఓ పెద్దాయన, కోపమెందుకొస్తుందో చెప్పారు, ఆయన ఉద్దేశ్యంలో దిక్కుమాలినతనము (నాకీ పదం నచ్చలేదుకాని బ్రౌన్ పదకోశంలో helplessness అంటే ఇదే ఇచ్చాడు ;)) వల్ల అని. ఎవరైనా మనమీద ఏదైనా విమర్శ చేస్తే, దానివల్ల మనమేమైనా చెయ్యగలిగితే పర్వాలేదు, చెయ్యలేకపోతే ... కోపమొస్తుంది అని (helplessness leads to anger అని ఓ ముక్కలో చెప్తే పోయేది కదా :)). I don't think, I have conveyed it correctly, what he meant was, criticism should be constructive such that the other person should be able to correct it and get benefit out of it, if you criticize on things that one can't change then it leads to anger due to helplessness, so simple, right :-)

ఏమైనా సరే నువ్వు వ్రాసేది చెత్త అంటే ఎవడికీ నచ్చదు (భవదీయుడితో సహా) (ఇక్కడ భవదీయుడు అంటే yours truly అని, భవదీయుడనే బ్లాగరు కాదు ;))

నమస్కారములతో,
~సూర్యుడు :-)