మనసు
మనసు అంటే ఏంటో? మనసు మీద మన తెలుగు సినేమాల్లో బోల్డు పాటలున్నాయి (మన'సుకవి'
గారి ధర్మమా అని). మిగిలిన పాటలన్నీ ఎలాఉన్నా బాలమురళీకృష్ణ గారు పాడిన "మౌనమె నీ
భాష ఓ మూగ మనసా" (సరే ఈ పాట ఎవరు వ్రాసారో తెలీదు) పాట భలే అనిపిస్తుంది, అంటే
మనసుని చాల చక్కగ వర్ణించిందేమో అనిపిస్తుంది. అది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ
ఉంటుంది. మా స్నేహిడొకడనేవాడు, డాగ్ బిజీ అని, అంటే ఏమిటంటే, కుక్కకి పని ఉన్నా
లేకున్నా ఎప్పుడూ పరిగెట్టి వెళ్తుంటుంది అని :-) అలాగే అవసరమున్నా లేకున్నా,
మనసు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, ఎందుకో ?
ఉదాహరణకి, తెలంగాణా వస్తుందా? రాదా? (వచ్చినా, రాకపోయినా తనకి పెద్దగా తేడాఏమీ
లేకపోవచ్చు, కాని మనసు ఊరుకోదు), ఇండియా ఈసారి ఆస్ట్రేలియా మీద (క్రికెట్టులో)
గెలుస్తుందా? గెలవదా?, మనకి తేడా ఏమైనా ఉంటుందా, ఏమీలేదు అయినా సరే, మనసు
ఊరుకోదు.
పూర్వం, అంటే ఇంటర్నెట్ లేని అజ్ఞానంధకార యుగంలో వార్తా పత్రికల్లో ఏదైనా వార్త
చదివినప్పుడు, నచ్చకపోతే (అంటే, మనసుకు నచ్చకపోతే అని తీసుకోవాలి) ఆ పేపర్‌వాడిని
కొంత తిట్టుకొని ఊరుకునేవాళ్ళం, ఇప్పుడలాకాదు, మన బ్లాగుల్లోనో,
ఫేసుబుక్కుల్లోనో, ఆ పేపర్‌వాడి (లేకపోతే న్యూస్ చానెల్ వాడి) తాట తీస్తాం కదా.
కాని అదే వార్త వేరొకరికి చాల సంతోషంగా అనిపించొచ్చు, అంటే ఏదైనా సరే ప్రపంచంలో
కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని కాని నచ్చకూడదనికాని
లేదు మరి అలాంటప్పుడు నచ్చనివాటిమీదపడి చావకొట్టాల్సిన అవసరముందంటారా?
కన్యాశుల్కంలో కరకట శాస్త్రి శిష్యుడు ఏదో తెలుగు పద్యం/కవిత్వం చదివి (ఆ
పద్యంలో కవిగారికి ఏదో పువ్వు ఇష్టం లేదని వర్ణన) వళ్ళు మండి, మా గురువుగారికి
దొండకాయలంటే ఇష్టం ఉండదు కాని ఇంట్లో దొండపాదుందని వాళ్ళావిడ రోజూ దొండకాయ కూరే
చేస్తారు, బ్రతికిన వాళ్ళిష్టాఇష్టాలే ఇలా ఏడుస్తుంటే చచ్చిన వాళ్ళిష్టాఇష్టాలతో
ఏమిపని అని అనుకుంటాడు. అసలు సంగతేంటంటే, మనకు నచ్చనివి కనిపించినప్పుడల్లా, మన
అభిప్రాయాల్ని చెప్పేయాలా? ఈ భూపెపంచకమ్మీద మనకి నచ్చనవి బొచ్చెడుంటాయి,
వాటన్నిటినీ ఎంతకన్న వ్యతిరేకిస్తూ మన అభిప్రాయాల్ని వ్యక్తీకరించగలుగుతాం? కాని
మనసు మాత్రం రగిలిపోతుంటుంది, అదీ సంగతి, దీనివల్ల రక్తపోటు పెరుగుతుందేమో కాని
ప్రపంచమేమీ మారిపోదుకదా మనకోసం.
అందువల్ల నేచెప్పొచ్చేదేంటంటే, ఊరుకున్నంత ఉత్తమం లేదు; బోడిగుండంత సుఖం లేదు అని
:)
ఈమద్య బ్లాగులు చదివి ఉండబట్ట/ఊరుకోలేక ఇలా ఇక్కడ, మీరుకూడా ఇది చదివింతర్వాత
మామూలుగ మీకు నచ్చనివాటిని ఉతికారేసే కార్యక్రమంలో ఉంటారని ఆశిస్తూ ... ;)
~సూర్యుడు :-)