కోవిడ్ లెక్కలు అంటే వేద గణితం, పాశ్చాత్య గణితమో లాంటిది కాదుకాని కోవిడ్ మహమ్మారి వల్ల జరుగుతున్నా లేదా చేస్తున్న పనులవల్ల జరిగే జమా ఖర్చుల వివరాలు, సాంఖ్యక విలువలు, సంభావ్యతలు ఎలాఉన్నాయన్నది చూద్దామని ...
ఇప్పుడు కోవిడ్ టీకాల ధరలు మారిపోతున్నాయి కాబట్టి సరాసరిని ఒకటీకాకు ఐదువందల రూపాయలనుకుంటే కనీసం ఓ యాభై కోట్లమంది టీకా తీసుకునేటట్లయితే ఎంత ఖర్చవుతుంది? ఇరవైఐదువేల కోట్లు, అదే రెండుసార్లు తీసుకోవాలంటే యాభైవేల కోట్లు. అసలు కోవిడ్ వచ్చిందోలేదో తెలుసుకోవడానికి చేసే పరీక్షకు సరాసరిని ఓ ఐదువందలనుకుంటే దేశంలో సగంమందికి (అంటే ఓ అరవైఐదు కోట్లనుకోవచ్చా?) పరీక్షలు చేస్తే అయ్యే ఖర్చు ముప్పైరెండువేల ఐదువందల కోట్లు. మరి తుమ్మినప్పుడల్లా ఈ పరీక్ష చేయించుకోమంటున్నారు కాబట్టి కనీసం రెండుసార్లు చేయించుకున్నా అరవైఐదువేల కోట్లు. అంటే పరీక్షలకు టీకాలకే లక్షాపదిహేనువేల కోట్లు. సరే ఇంక ఆసుపత్రులలో చేరినవారికి ఎంతెంత ఖర్చవుతోంది, మందులకెంత ఖర్చవుతోంది, ముక్కు మూతి కప్పుకోవడానికి, చేతులు కడగడానికి ఎంత ఖర్చవుతోందో చూస్తే తల తిరిగేలా ఉంది.
ఇదంతా ప్రజలనుంచి వెళ్ళిపోతున్న ధనమేకదా?
ఈ మహమ్మారి ప్రభావంవల్ల పట్నాల్లో దైనందిక జీవితం స్థంభిస్తే ఉద్యోగాలు
పోయినవాళ్ళెంతమంది, వ్యాపారాలు లేక నష్టపోయినవారెంతమంది? ఇది మనం
లెక్కవేయలేముకదా. అంటే రావలసిన ఆదాయం రావటంలేదు కానీ ఖర్చుమాత్రం పెరిగిపోయింది.
దీనిప్రభావం మధ్యతరగతిమీదెంత? మొత్తంమీద నష్టమెంత?
ఇక ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది కోలుకుంటున్నారు, ఎంతమంది ఆసుపత్రులకెళ్తున్నారు, ఎంతమంది ప్రాణాలుకోల్పోతున్నారు, ఇవన్నీ కాకిలెక్కలే, కదా? ఇప్పుడు ఈరెండో కెరటం పల్లెలక్కూడా పాకడంతో, ఎంతమంది పరీక్షలు చేయించుకుంటున్నారు, ఎంతమంది వైద్యం చేయించుకుంటున్నారు ఎవరికి తెలుసు.
ఇక ఇలా ఎన్ని కెరటాలొస్తాయి, ఇవన్నీ ముగిసేసరికి ఎంతమంది మిగులుతారో ఎవరికీ తెలీదు. మిగిలినవాళ్ళకి తీసుకున్న మందులవల్ల ఇంకేమైనా వ్యాధులు వస్తాయా, వాటి పర్యవసానమేమిటి అన్నది అసలు తెలీదు.
ఈ మహమ్మారి వాళ్ళ ఎవరెవరికి ఎంత నష్టమో అర్ధమైంది మరి లాభమెవరికైనా ఉంటుందా? ఉంటే ఎవరికి?
~ సూర్యుడు 😷
No comments:
Post a Comment