Sunday, April 14, 2024

వడ్డెర చండీదాస్ నవలలు

నేను చిన్నప్పుడు చాలా తెలుగు నవలలు చదివాను కానీ, వడ్డెర చండీదాస్ గురించి ఎప్పుడు వినలేదు. అందువల్ల చదివే అవకాశం అసల్లేదు. తెలుగు బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పటినుంచే ఇతని గురించి వింటున్నాను. అయినా పెద్దగా చదవాలనిపించలేదు. కానీ ఈమధ్య అతని నవల అనుక్షణికం పరిచయం చదివాక ఎందుకో చదివి చూడాలనిపించింది. అనుక్షణికం, హిమజ్వాల కొని అనుక్షణికం పూర్తిచేశాను.

ఈ నవలకు అనుక్షణికం అనేకన్నా పరాజితులు అని పెడితే సరిపోతుందేమోననిపించింది. ఎవరో ఒకటి రెండు పాత్రలు తప్ప మిగిలినవన్నీ ఫెయిల్ అయిన జీవితాలే. సరే ఫెయిలో పాసో మనం చూసే దృష్టి బట్టి ఉందనుకోండి. 

ఈ నవల వ్రాసిన కాలానికి పాత్రల చిత్రీకరణ, వర్ణనలు కొద్దిగా విప్లవాత్మకమేమో. కొన్ని కొన్ని వర్ణనలు పెద్ద పెద్ద పేరాగ్రాఫ్ లాగా ఉండడంతో మొదట్లో చదివినా తర్వాత్తర్వాత కొన్ని కొన్ని చదవలేదు. మరీ ఎక్కువ కవితాత్మకంగా / (ఆధ్యాత్మికంగా?) అనిపించాయి :)

ఇది చదివిన తర్వాత హిమజ్వాల మొదలుపెట్టాను కానీ కొన్ని పేజీలు చదవంగానే అది మరీ అసహజంగా అనిపించి ఆపేశాను. 

అనుక్షణికం అంత గొప్పగా అనిపించలేదు అలాఅని మరీ చెత్తగా కూడా లేదు. హిమజ్వాల పూర్తిగా చదవలేదు. ఎప్పుడైనా సమయం దొరికితే చూడాలి. 


అనుక్షణికం మొదలుపెట్టకముందు ది అల్కెమిస్ట్ మళ్ళీ చదువుదామనిపించి తీసాను. మొదటిసారి చదివినప్పుడు, "మొదటిసారి చూసినప్పుడద్దరాతిరి చూసుకున్నచూపులన్ని అదోమాదిరి" అన్నట్టు అసలు కథేంటో తెలుసుకోవాలన్న ఉత్సాహంలో ఆ ఫిలాసఫీ అర్ధం చేసుకోడానికి ప్రయత్నించలేదు. మొదటి కొన్ని పేజీలే చదివాను కానీ చాల ఆసక్తికరంగా అనిపించింది. అందులో కథానాయకుడు శాంటియాగో క్రొత్త పుస్తకం తీసుకునే ఆలోచనల్లో అనుకునేదేమిటంటే పుస్తకంలో ఎక్కువ పేజీలుండాలి, ఎక్కువరోజులు చదవచ్చు, ఆ తర్వాత పుస్తకం మొదట్లోనే అన్ని పాత్రలను ప్రవేశపెట్టకూడదని. ఆ తర్వాత అనుక్షణికం చదివినప్పుడు అదే అనిపించింది మొదట్లోనే బోళ్ళన్ని పాత్రలు వచ్చేస్తాయి. 

 ది అల్కెమిస్ట్ మళ్ళీ పూర్తి చేసినతర్వాత ఎలా అనిపించిందో వ్రాస్తాను. 

 

~సూర్యుడు :-)