వార్త అంటే తెలుగు వార్తాపత్రిక అని పొరపాటు పడకూడదని. నా ఉద్దేశ్యంలో వార్త నిర్వచనం ఏంటంటే ఏదైనా జరిగిన సంఘటన గురించి వ్రాసినా చదివినా లేదా చూపించినా దాన్ని వార్త అంటారు (అంతేనా?). ఇప్పుడు మన ప్రసార మాధ్యమాల్లో వార్తలు తక్కువ, ఊహలెక్కువ. ఉదాహరణకు ఫలానా వ్యక్తి ప్రస్తుత పార్టీ నుండి ఇంకో పార్టీలోకి దూకేస్తున్నాడా? అని ఒక శీర్షిక పెడతారు (అలాగే ఏదో హల్చల్ చేస్తొందంటారు , ఈ పదం చదివినప్పుడల్లా ఏవో వంటినిండా పాకిన అనుభూతి:(). ఇక్కడ ఆ దూకడమింకా జరగలేదు. జరగొచ్చు జరగ్గపోవచ్చు. కానీ జరగొచ్చేమోనన్న ఊహ. ఇలాంటి ఊహలు చర్చల్లో పర్వాలేదేమో కాని వార్తల్లో ఉండకూడని నా అభిప్రాయం. అప్పుడెప్పుడో స్టార్ న్యూస్ ఛానల్ ను వ్యంగ్యంగా స్టార్ వ్యూస్ అనేవారు. ఇప్పుడన్ని వార్తా చానెల్స్ వ్యూస్ ఛానెల్సే.
ఇప్పడు సోషల్ మీడియా వచ్చి వ్యూస్ ఎగిరిపోయి ఫేక్ వచ్చింది. ఇలా ప్రతిదీ ఫేక్ అయిపోతే ఏ వార్తా నమ్మలేని పరిస్థితి వచ్చి నిజమో ఫేకో వైష్ణవమాయో తెలిసీ తెలియని అయోమయములో అని పాడుకుంటూ కూర్చోవడమే. ఇలా వార్తా ప్రపంచాన్ని నమ్మలేకుండా చేసేస్తే నిజంగా ఏంజరుగుతోందో తెలియకుండా ఫిలాసఫీ లో చెప్పినట్టు అంతా మాయే. అప్పుడు ఎవరికి కావలసింది వారు చేసుకోవచ్చు ;)
ఇంతకుముందు ఒక రాజకీయ పార్టీని మోసే పత్రికలంటే చిరాగ్గా ఉండేది. కాని ఇప్పుడు ప్రతి పత్రిక, TV ఛానల్, వెబ్ ఛానల్, వాట్సాప్ గ్రూపులు ఏదో ఒక పార్టీని మోసేవే. చిరాకు పోయి అలవాటైపోయింది ;). ప్రతి మనిషి ఎలాగైతే తనకి నచ్చిన మతాన్ని అనుసరించి సంతోషంగా ఉంటున్నాడో అలాగే వాళ్ళ వాళ్ళ నచ్చిన పత్రికలు చదువుకుంటూ వార్త చానెల్స్ చూసుకుంటూ ఆనందంగా కాలం గడిపేస్తున్నారు, ప్రపంచమంతా మనకి (అంటే మన పార్టీకి) అనుగుణంగానే జరుగుతోందనుకుంటూ. ఇదే సచ్చిదానందమంటే :)
~సూర్యుడు :-)