Wednesday, May 27, 2009

బెంగళూరు అందాలు

బె ంగళూరులో కొన్ని సంవత్సరాలనుండి ఉంటున్నా ఎప్పుడూ గమనించలేదు ప్రత్యేకంగా కాని ఈ సంవత్సరమెందుకో అలా అనిపిస్తోంది. బెంగళూరులో నాకు ముఖ్యంగా నచ్చినవి చెట్లు. అందులోనూ దక్షిణ బెంగళూరులో పసరిక ఎక్కువగా ఉంటుంది. నేనుండే ప్రదేశమక్కడే.

ఎన్.ఆర్ కోలనీ ప్రధాన రహదారికి అటు-ఇటు చెట్లు భలే ఉంటాయి. అవి ఏ వృక్షాలో తెలీదు కాని, చాలా పెద్దవిగా పెరుగుతాయి. వేసవి ముందే చక్కగా చిగిర్చి మంచి నీడనిస్తాయి. కొన్ని కొన్ని కూడళ్ల వద్ద అసలు ఎండే కనిపించదు వీటివల్ల. అలాగే జైన్ కాలేజ్ రోడ్లో, సౌత్ ఎండ్ సర్కిల్ నుండి జె.పి నగర్ వెళ్లే రోడ్డు అద్భుతం. కార్పొరేషన్ (హడ్సన్) సర్కిల్ నుండి కబ్బన్ పార్క్ మెయిన్ గేట్ వరకు (కస్తూర్బా) రోడ్డు గురించి చెప్పనక్కర్లేదు.

అలాగే, మార్చి వెళ్లి ఏప్రిల్ వస్తుండగా ఒకరకమైన చెట్లు పసుపురంగు పువ్వులు పూస్తాయి. ఇవి దాదాపుగా అన్ని రోడ్లమీదా కనిపించినా, కస్తూర్బా రోడ్లో, వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీకి విశ్వేశరాయ మ్యూజియమ్‌కి మధ్యలో బోలెడు ఉంటాయి. ఆసలు ఒక్క ఆకూ లేకుండా మొత్తం పువ్వులు పూస్తుందీ చెట్టు.

ఏప్రిల్ వెళ్తూ మే వస్తుండగా గుల్‌మొహర్ చెట్లు ఆకుపచ్చని ఆకుల మధ్యలో ఎర్రని పువ్వులు పుస్తూ భలే ఉంటాయి. ఇన్నిరోజులున్నా గమనించని ఈ అందాలు ఈ మధ్యనే, "నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో ... పూసిన ప్రతి పూవొక వధువు ... " అన్న టైపులో కనిపిస్తున్నాయి :-)

ప్రస్తుత ఈ టపాకి (ఎర్ర పువ్వులు పూస్తున్న) గుల్‌మొహర్ చెట్లే ప్రేరేపణ ...

~సూర్యుడు :-)

8 comments:

రవి said...

యష్వంతపూర్ దగ్గర iisc దగ్గరా ఓ గుల్మొహర్ చెట్టొకటి ఉండేది. అప్పట్లో కంపనీ బస్సు దాదాపు మా ఇంటి దగ్గర వచ్చినా, ఆ చెట్టును పలకరించటం కోసం, ఓ కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్ళి ఎక్కేవాణ్ణి. పొద్దునపూట.

మీరు చెప్పిన, ఆకుల బదులు, మొత్తం పూలు పూచేది, ముదురు నీలం రంగులోనూ ఉండేది.

అన్నట్టు NR కాలనీ నాకూ అభిమాన ప్రదేశం.

మేధ said...

>>మీరు చెప్పిన, ఆకుల బదులు, మొత్తం పూలు పూచేది, ముదురు నీలం రంగులోనూ ఉండేది
రవి గారి మాటే నా మాటానూ... ఆ పూలు వయొలెట్ రంగులో ఉంటాయి.. ఆకులే లేకుండా, కేవలం పూలతో భలే ఉంటాయి ఆ చెట్లు...

సుజాత వేల్పూరి said...

మీరు చెప్పిన అందాలన్నీ చిరపరిచితమే! దశాబ్దాలుగా బెంగుళూరులో ఉంటున్నవాళ్ళు "ఇవేం చెట్లు? ఒకప్పుడు ఇంతకు పదింతలు ఉండేవి" అని చెప్తుంటే అదెలా సాధ్యమా అనిపిస్తుంది కొన్ని కొన్ని రోడ్లను చూస్తుంటే! బెంగుళూరు సౌత్ లో మరీనూ! జేపీ నగర్ మీదుగా జయనగర్ వెళ్ళే దారుల్లో పగలే చీకటి కమ్మే పార్కులు, చివరికి విపరీతమైన రష్ తో ఉండే జయనగర్ నాలుగో బ్లాక్ మెయిన్ రోడ్డు మీద సైతం నీడను పరిచే ఎత్తయిన చెట్లు చూస్తుంటే ఉద్యాన నగరి అనే మాట కరక్టే అనిపిస్తుంది. రవి గారు, మేథ చెప్పిన వయొలెట్ పూల చెట్టు IIM Campusలో ప్రహరీ గోడ పక్కనే కూడా ఉంటుంది. ఆ చెట్టుని చూడ్డం కోసమే ఆ కాంపస్ లో ఉన్న పోస్టాఫీసు కు వెళ్ళేదాన్ని నేను.

ఇంకొంచెం ముందుకెళ్తా..అసలు కర్ణాటకే ఎంతో అందంగా ఉంటుందండీ! కావేరీ పరివాహక ప్రాంతాలు..తలకాడు,మేకదాటు,మైసూర్,తలకావేరి...ఒకటేమిటి, ఎంతో అందమైన రాష్ట్రం!

రవి said...

కర్ణాటక నిజంగానే చాలా వైవిధ్యంగానూ అందంగానూ ఉంటుంది.

ఇటు మైసూరు, ఆంధ్ర బోర్డర్ లో పావగడ, మధుగిరి, బళ్ళారి, అటు వెళితే చిక్కమగళూరు, శృంగేరి, ఆగుంబె, కొల్లూరు, ఉడుపి...పైకెళితే గోకర్ణ, కార్వార్ ఠాగూర్ బీచ్, మధ్యకొస్తే, బాదామి, ...అబ్బో... అన్ని రకాలు గానూ అందమైనది. అయితే, ఎందుకనో, నాకు బెంగళూరులో చెట్లు, ఉద్యానాలు అనే విషయం తప్ప, దాదాపుగా మిగతా ఏవీ నచ్చవు. బ్లాగు మొదలెట్టిన రోజుల్లో బెంగళూరును తిడుతూ ఓ మూడు టపాలు రాసినట్టున్నాను.

సూర్యుడు said...

అందరికీ ధన్యవాదాలు :-)

వయొలెట్ పువ్వు‌ల్నెప్పుడూ చూసిన గుర్తులేదు :(

ఇప్పుడు కనిపిస్తున్నవికూడా ఈ మధ్యనే కనిపించడం మొదలుపెట్టాయి కాబట్టి మిగిలినవి కూడా త్వరలోనే కనిపిస్తాయని ఆశిస్తాను ;)

నమస్కారములతో,
~సూర్యుడు :-)

సూర్యుడు said...

బెంగళూరు చెట్లు గురించి చెప్పుకుని ఇంకొక్క విషయం చెప్పుకోపోతే ఏదో వెలితిగా ఉంటుంది, అందుకే అదికూడా ఇక్కడ పెట్టెద్దామని ... :)

గాంధీబజార్ అని ఒకటుంది ఇక్కడ, ఇప్పుడు మారిపోయింది కాని పూర్వం భలే ఉండేదిట, ఆ రోడ్డులో ఎన్ని చెట్లు ఉండేవంటే, అరోడ్డుమీద నడుచుకుంటూ వెళ్లేటప్పుడు గొడుగేసుకుని వెళ్లేవారుట, మాస్తి వేంకటేశ్ అయ్యంగార్ అని ఒకాయన (జ్ఞానపీఠ బహుమతి గ్రహీత), పక్షుల రెట్టలు బుర్ర / తల మీద పడకుండా :-)

అలాగే రామకృష్ణాశ్రమ సర్కిల్ నుండి లాల్‌బాగ్ వెస్ట్ గేట్ వైపు వెళ్లే రోడ్డు కూడా ఇటు అటు చెట్లతో భలే ఉండేది, ఫ్లైఓవర్ (అక్కడ ప్రజలు వద్దన్నా కట్టి) అని కొన్ని కొట్టేశారు :(

లాల్‌బాగ్ వెస్ట్ గేట్ పైన బోర్డ్‌లో ఇలా వ్రాసుంటుంది:

"ఇది సస్య కాశి, చేతులతో నమస్కరించి లోపలికి రా" అని (కన్నడంలో అనుకోండి) :)

~సూర్యుడు :-)

రవి said...

గాంధీబజార్ గుర్తు కొస్తే, విద్యార్థి భవన్ దోసెలు గుర్తుకొస్తాయి. అలానే రోటీ ఘర్ వగైరా..

లాల్ బాగ్ గేటుపై రాసున్నది.

"ಇದು ಸಸ್ಯ ಕಾಶಿ. ಕೈ ಮುಗಿದು ಒಳಗೆ ಬಾ"

సూర్యుడు said...

@రవి గారు:

:-)

అవును. నేనుకూడా ఓ రెండు మూడు సార్లు వెళ్లుంటాను, విద్యార్ధి భవన్ కి.

పువ్వుల దుకాణాలు, పండ్ల దుకాణాలు, కూరల కొట్లు :-)

డి.వి.జి రోడ్డులో ఏవో సాంప్రదాయక సామానులు దొరికే కొట్లు :-)

Book world :-)

మీరుకూడా అక్కడకి తరచు వెళ్లేవారైతే మిమ్మల్నెప్పుడైనా చూసొండొచ్చు ;)

~సూర్యుడు :-)