Wednesday, August 24, 2011

ద కోబ్రా

ఈ మధ్య నేనో మూడు నవలలు చదివా, The Matarese Circle, The Matarese Countdown మరియు The Cobra. మొదటి రెండు, Ludlum మార్కు నవలలు, చదువుతున్నంతసేపు బాగుంటాయి, గుర్తుపెట్టుకోడానికేమీ ఉండదు. ద కోబ్రా, ఫోర్సిత్ క్రొత్త నవల. డ్రగ్ వ్యాపారం మీద ఓ మాదిరి పరిశోధన చేసి వ్రాసినట్లనిపించింది. అమెరికా అద్యక్షుడు ఓ సంఘటన వల్ల, మొత్తం కొకైన్ వ్యాపారాన్నే నాశనం చెయ్యాలని ఓ పాత సి.ఐ.ఎ ఏజెంటుని అడుగుతాడు, దానికి అతను (పాల్, ద కోబ్రా) కొన్ని నిబందనలు పెట్టి ఒప్పుకుంటాడు

ఇందులో ఓ డైలాగుంటుంది,  "ఐ యాం డిమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ డెలిబరేట్ డిస్‌ఇన్ఫర్మేషన్" అని.

Tuesday, August 23, 2011

వేలంవెర్రి

వేలంవెర్రి కి ఎవరైనా నిర్వచనము, ఉదాహరణలు ఇవ్వగలరా?

సూచన: ఇప్పటిదాకా వారి జీవితంలో ఒక్కసారికూడ అవినీతి (దీన్నికూడ నిర్వచించి) కి పాల్పడనివారే ఈ టపాకి వ్యాఖ్య వ్రాయడానికి అర్హులు ;)


Sunday, August 14, 2011

మీరు గమనించారా?

మీరు ఏదైనా క్రొత్తగా ఆలోచిస్తున్నాము అనిపించినప్పుడు, అది ఇదివరకెవరైనా అప్పుడే కనిపెట్టేసారా లేదా అని చూడ్డానికి ఏంచేస్తారు? గూగుల్‌ని అడుగుతారు, ఇది నీకేమైనా తెలుసా అని, అది ఉహూ అందనుకోండి, అంటే మీ ఆలోచన ఇంతవరకెవరికీ రాలేదన్నమాట కదా? కానీ, మరి మీఆలోచన్ని గూగుల్‌కి చెప్పేసారే, గూగుల్‌కి కూడా మీ ఆలోచన బాగుందనిపించిందనుకోండి, మరి వాళ్లు దాన్ని వాడుకోకుండా వదిలేస్తారా? ఏమో? :)

సరే, నేను చదువుకుంటున్న రోజుల్లో ఓ సిటీ బస్సు కండక్టర్ ఏమన్నాడంటే, ఇంట్లో పెళ్లామ్మీదలిగినా సిటీ బస్సుమీద రాళ్లేసేస్తారని, అలాగే, ఇప్పుడు మనింట్లో బల్లరిచినా బ్లాగుల్లో రాసేయాలి, మరి ఈ రాతలన్నీ ఎక్కడ నిలవౌతున్నాయి / పేరుకుపోతున్నాయి? ఎక్కడో గూగుల్ సర్వర్లలోనో, లేక వేరే బ్లాగు సర్వీసు ప్రొవైడర్ సర్వర్లలోనో కదా. డాటా ఎనలైటిక్స్ సాఫ్ట్‌వేర్లనుపయోగించి ఇవన్నీ గాలిస్తే, మనింట్లో బల్లరిచిన విషయం తెలియకుండా ఉంటుందా? ఈ మధ్యనే ఎవరో ఓ గోల పెట్టేస్తున్నారు, మన ఆధార్ డాటా అంతా ఎక్కడికో వెళ్లిపోతోందని. ఊరికే కూర్చుని బ్లాగుల్లో మన బుర్రలో ఆలోచనల్ని రాసేస్తుంటే, ఇంకా ఆధార్ డాటా ఎందుకు, ఇక్కడే మన పల్స్ తెలియటంలా? ఉదాహరణకి, మన తెలంగాణా విషయమే తీసుకోండి, మన బ్లాగురాతలు, మన ప్రాంతీయ బేధాలని బయటకు చెప్పట్లేదా?


సరే, మన విషయాలన్నీ బ్లాగుల్లో వ్రాసేయాలా?

Saturday, August 6, 2011

అదీ సంగతి ...

ఈమధ్య మా ఆఫీసుకి వెళ్లే ప్రయాణ సమయంలో ముసురుకొనే ఆలోచన్లను కాస్త మీతోకూడా పంచుకుందామని, ఇలా :)

మీరెప్పుడైనా క్యూల్లో నుంచున్నట్లైతే, ఎప్పుడూ, మన ప్రక్క క్యూ మన క్యూ కన్నా ఫాస్ట్ గా కదులుతున్నట్టనిపిస్తుంటుంది కదా :), ఇది రోడ్డుమీద వాహనాల క్యూలక్కూడా వర్తిస్తుంది. ఇండియాలో డ్రైవింగు, లేన్ డిసిప్లేన్ అనేవి ఆక్సీమోరన్ లాంటివని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా కదా, సరే మనమేళ్లే లేన్ ఫాస్ట్ గా కదలకపోతే, ప్రక్క లేన్ లోకి దూకు అనేది మనలాజిక్కు, అదీ కదలకపోతే ఆ ప్రక్కలేన్లోకో లేకపోతే ఈప్రక్క లేన్లోకో దూకుతూ దూకుతూ ఎలాగోలా ఆఫీసుకి టైంకి చేరామా లేదా అనేదే ప్రశ్న. ఇలా దూకడంలో అప్పుడప్పుడూ ఈప్రక్కవాడినో ఆప్రక్కవాడినో ముద్దెట్టేసుకుని వాడితో ఓ నాలుగనిపించుకుని భలే మజా వస్తూంటుంది :)

ఇలా దూకుతూ దూకుతూ వెళ్తూండగా, లేటుగా అయినా లేటెస్టుగా కనిపెట్టిందేమంటే, ట్రాఫిక్కు సిగ్న్ల్సనేవి నార్మలైజేషన్ పాయింట్లు. మనమెంత కంగారుగా వెళ్దామన్నా, వేరే ఎవరైనా వెళ్లిపోదామనుకున్నా, ట్రాఫిక్కు సిగ్నల్దగ్గరో, జాంలోనో ఇటూ అటూ చూస్తే మళ్ళీ వారే :). సో, ఎంత కంగారుపడినా, మళ్లీ అక్కడే, అదీ సంగతి ... (ఈ మూడు చుక్కలగురుంచొకసారి చెప్పుకోవాలి, పిట్టకథ: చిన్నప్పుడు పరీక్షల్లో ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పడానికి ఈ చుక్కలు పెట్టేవాళ్లం కదా, పరీక్ష పేపర్ ఇంకా సరిగ్గా నిండటంలేదని అనుమానమొచ్చినప్పుడు, ఈ చుక్కల సంఖ్య పెరిగిపోతుండేది :), అంటే ఓ పది పదిహేను చుక్కలు, ప్లేసు సరిపోకపోతే ఓ రెండు చుక్కలు, ఈ టైపులో నడిపించుకొచ్చేస్తుంటే, ఓ క్రొత్త క్లాసులో ఓ క్రొత్త మాష్టారొచ్చి, ఈ చుక్కల సూత్రం చెప్పారన్నమాట, మీ ఓపిక్కొద్దీ చుక్కలుకాదు, ఎప్పుడైనా మూడే చుక్కలుపెట్టాలని, అంతే, అక్కడనుండి, మన పరీక్ష పేపర్ సైజ్ రిక్వైర్‌మెంట్ తగ్గిపోయింది, చుక్కలతోపాటుగా :))

ఇలా లేన్లు దూకినట్టే కొంతమంది కంపెనీలే దూకేస్తుంటారు, కెరీర్ గ్రోత్తో, సాలరీ గ్రోత్తో, ఇంకేదో గ్రోత్తో అనుకుంటూ, గోతిలో పడుతూంటారు, ఈ నార్మలైజేషన్ టెక్నిక్కులు అర్ధంచేసుకోలేక :), ఇది నాఅపోహ లేక నిజమేనా, మీకేమనిపిస్తోంది?