Friday, June 25, 2021

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ - జ్ఞాపకాలూను

ఆమధ్య ఎప్పుడో వాట్సాప్ లో తెలుగు పుస్తకాల లింకులు వచ్చాయి. అందులో ఒకటి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి  గారి  అనుభవాలూ - జ్ఞాపకాలూను. అప్పుడే డౌన్లోడ్ చేసినా ఇప్పటివరకు చదవడానికి కుదర్లేదు. ఈ మధ్యనే మళ్ళీ కనిపిస్తే చదవాలనిపించి చదివాను. ఇలాంటి పుస్తకాలు చదివానని చెప్పుకోవడమే తప్పిస్తే అవి ఎలా ఉన్నాయో చెప్పగలిగే అర్హతలు లేకపోవడంవల్ల నాకేమనిపించిందో గుర్తున్నవి వ్రాస్తాను. 

 మొదటిగా ఆయన ఆర్థికపరిస్థితి, అదీ చివరిదశలో ఎలా ఉండిందో తెలుసుకొని చాలా బాధ అనిపించింది. కళాకారులకేదో శాపం ఉండుంటుంది. ఎవరో కొద్దిమందిని  మినహాయిస్తే చాలావరకు కళాకారుల ఆర్థికపరిస్థితి ఇంతేనేమో. 

 వ్రాసిన తెలుగు భాష సరళంగా ఉంది,  గ్రాంధికం కాకుండా. ఆయన విద్యాభ్యాసం అప్పటి పరిస్థితులగురించి చాలా వివరంగా వ్రాసారు. ఇప్పటివాళ్లకి తెలుసుకోవడానికి బాగుంటాయి. పాతకవుల గురించి ప్రస్తావించారు కానీ అందులో పోతన లేకపోవడం నాకెందుకో నచ్చలేదు.

ఆయన సంస్కృతంలో చదువుకుని తెలుగులో వ్రాయడంవల్ల ఏది గొప్పదో లేక ముఖ్యమో అన్నవిషయంలో ఆయన ఇచ్చిన వివరణ నాకు సరిగ్గా అర్ధంకాలేదు. అలాగే పద్యం వ్రాసినవాడే కవా లేక వచనం వ్రాసినవాడు కూడా కవేనా అన్న విషయంలో చాలా వివరణ ఇచ్చారు కానీ నాక్కూడా పద్యం వ్రాసినవాడే కవని ఘాట్టి నమ్మకం :).  అసెంబ్లీ లాంగ్వేజ్ (శ్లేషనింటెండెడ్) గొప్పదా పైథాన్ లాంగ్వేజ్ గొప్పదా అనడిగితే ఏంచెప్తారు,  ఏది వ్రాసేవాళ్ళు అదిగొప్పదంటారు, అదే సహజం కానీ దేని గొప్ప దానిదే, దేని ఉపయోగం దానిదే.

విమర్శ గురించి వ్రాస్తూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లో కోడ్ రివ్యూలలో పాటిస్తున్నారు. అదే, వ్రాసినదాంట్లో తప్పులని విమర్శించాలి కానీ వ్రాసినవాడిని విమర్శించకూడదని. ప్రామాణికమైన మాట (ఈ మాట సరైనదేనా?). 

అష్టావధానాలని తీసిపారేయడం నాకునచ్చలేదు, నాకవంటే ఇష్టంగాబట్టి. ఇదిచెప్తూ, ఇవి సామాన్య ప్రజలని ఆకట్టుకుంటాయి కానీ గొప్పవికావన్నారు. కానీ జనరంజకంకాని కళకు సార్ధకం ఏమిటి?

వాట్సాప్ లో తిరుగుతున్న శ్రీ పిడపర్తి దక్షిణామూర్తి గారి కోర్టు సీను ఇందులోదే. మరి ఆరోజుల్లో (గొల్లపూడి మారుతీ రావు గారు అనే వరుసలో అనుకోండి :)) అలాంటి గొప్పవారు ఉండేవారేమో. ఎప్పుడైతే విద్య వాణిజ్యమైపోతుందో అప్పుడే దాని శక్తి, విలువ తగ్గిపోతాయనుకుంటా.

ఈయనకీ కాంగ్రెస్ అంటే పడదనుకుంటా :)

 ఈయన వ్రాసిన పుస్తకాలేవీ ఇంతకుముందు చదవలేదు, దొరికితే కొని చదవాలి.

నాఅభిప్రాయాలు ఎవరినీ కించపరచడానికికావని తెలియచేసుకుంటూ, ఏమైనా తప్పులుంటే మన్నించేయండి 🙏

~సూర్యుడు 😷 :-)

Saturday, June 5, 2021

కోవిడ్ లెక్కలు

 కోవిడ్ లెక్కలు అంటే వేద గణితం, పాశ్చాత్య గణితమో లాంటిది కాదుకాని  కోవిడ్ మహమ్మారి వల్ల జరుగుతున్నా లేదా చేస్తున్న పనులవల్ల జరిగే జమా ఖర్చుల వివరాలు, సాంఖ్యక విలువలు, సంభావ్యతలు ఎలాఉన్నాయన్నది చూద్దామని ... 

 

ఇప్పుడు కోవిడ్ టీకాల ధరలు మారిపోతున్నాయి కాబట్టి సరాసరిని ఒకటీకాకు ఐదువందల రూపాయలనుకుంటే కనీసం ఓ యాభై కోట్లమంది టీకా తీసుకునేటట్లయితే ఎంత ఖర్చవుతుంది? ఇరవైఐదువేల కోట్లు, అదే రెండుసార్లు తీసుకోవాలంటే యాభైవేల కోట్లు. అసలు కోవిడ్ వచ్చిందోలేదో తెలుసుకోవడానికి చేసే పరీక్షకు సరాసరిని ఓ ఐదువందలనుకుంటే దేశంలో సగంమందికి (అంటే ఓ అరవైఐదు కోట్లనుకోవచ్చా?) పరీక్షలు చేస్తే అయ్యే ఖర్చు ముప్పైరెండువేల ఐదువందల కోట్లు. మరి తుమ్మినప్పుడల్లా ఈ పరీక్ష చేయించుకోమంటున్నారు కాబట్టి కనీసం రెండుసార్లు చేయించుకున్నా అరవైఐదువేల కోట్లు. అంటే పరీక్షలకు టీకాలకే లక్షాపదిహేనువేల కోట్లు. సరే ఇంక ఆసుపత్రులలో చేరినవారికి ఎంతెంత ఖర్చవుతోంది, మందులకెంత ఖర్చవుతోంది, ముక్కు మూతి కప్పుకోవడానికి, చేతులు కడగడానికి ఎంత ఖర్చవుతోందో చూస్తే తల తిరిగేలా ఉంది. 

 ఇదంతా ప్రజలనుంచి వెళ్ళిపోతున్న ధనమేకదా?

 

 ఈ మహమ్మారి ప్రభావంవల్ల పట్నాల్లో దైనందిక జీవితం స్థంభిస్తే ఉద్యోగాలు పోయినవాళ్ళెంతమంది, వ్యాపారాలు లేక నష్టపోయినవారెంతమంది? ఇది మనం లెక్కవేయలేముకదా. అంటే రావలసిన ఆదాయం రావటంలేదు కానీ ఖర్చుమాత్రం పెరిగిపోయింది. దీనిప్రభావం మధ్యతరగతిమీదెంత? మొత్తంమీద నష్టమెంత?

 

ఇక ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది కోలుకుంటున్నారు, ఎంతమంది ఆసుపత్రులకెళ్తున్నారు, ఎంతమంది ప్రాణాలుకోల్పోతున్నారు, ఇవన్నీ కాకిలెక్కలే, కదా? ఇప్పుడు ఈరెండో కెరటం పల్లెలక్కూడా పాకడంతో, ఎంతమంది పరీక్షలు చేయించుకుంటున్నారు, ఎంతమంది వైద్యం చేయించుకుంటున్నారు ఎవరికి తెలుసు. 


ఇక ఇలా ఎన్ని కెరటాలొస్తాయి, ఇవన్నీ ముగిసేసరికి ఎంతమంది మిగులుతారో ఎవరికీ తెలీదు. మిగిలినవాళ్ళకి తీసుకున్న మందులవల్ల ఇంకేమైనా వ్యాధులు వస్తాయా, వాటి పర్యవసానమేమిటి అన్నది అసలు తెలీదు. 


ఈ  మహమ్మారి వాళ్ళ ఎవరెవరికి ఎంత నష్టమో అర్ధమైంది మరి లాభమెవరికైనా ఉంటుందా? ఉంటే ఎవరికి?


~ సూర్యుడు 😷