Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Friday, June 25, 2021

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ - జ్ఞాపకాలూను

ఆమధ్య ఎప్పుడో వాట్సాప్ లో తెలుగు పుస్తకాల లింకులు వచ్చాయి. అందులో ఒకటి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి  గారి  అనుభవాలూ - జ్ఞాపకాలూను. అప్పుడే డౌన్లోడ్ చేసినా ఇప్పటివరకు చదవడానికి కుదర్లేదు. ఈ మధ్యనే మళ్ళీ కనిపిస్తే చదవాలనిపించి చదివాను. ఇలాంటి పుస్తకాలు చదివానని చెప్పుకోవడమే తప్పిస్తే అవి ఎలా ఉన్నాయో చెప్పగలిగే అర్హతలు లేకపోవడంవల్ల నాకేమనిపించిందో గుర్తున్నవి వ్రాస్తాను. 

 మొదటిగా ఆయన ఆర్థికపరిస్థితి, అదీ చివరిదశలో ఎలా ఉండిందో తెలుసుకొని చాలా బాధ అనిపించింది. కళాకారులకేదో శాపం ఉండుంటుంది. ఎవరో కొద్దిమందిని  మినహాయిస్తే చాలావరకు కళాకారుల ఆర్థికపరిస్థితి ఇంతేనేమో. 

 వ్రాసిన తెలుగు భాష సరళంగా ఉంది,  గ్రాంధికం కాకుండా. ఆయన విద్యాభ్యాసం అప్పటి పరిస్థితులగురించి చాలా వివరంగా వ్రాసారు. ఇప్పటివాళ్లకి తెలుసుకోవడానికి బాగుంటాయి. పాతకవుల గురించి ప్రస్తావించారు కానీ అందులో పోతన లేకపోవడం నాకెందుకో నచ్చలేదు.

ఆయన సంస్కృతంలో చదువుకుని తెలుగులో వ్రాయడంవల్ల ఏది గొప్పదో లేక ముఖ్యమో అన్నవిషయంలో ఆయన ఇచ్చిన వివరణ నాకు సరిగ్గా అర్ధంకాలేదు. అలాగే పద్యం వ్రాసినవాడే కవా లేక వచనం వ్రాసినవాడు కూడా కవేనా అన్న విషయంలో చాలా వివరణ ఇచ్చారు కానీ నాక్కూడా పద్యం వ్రాసినవాడే కవని ఘాట్టి నమ్మకం :).  అసెంబ్లీ లాంగ్వేజ్ (శ్లేషనింటెండెడ్) గొప్పదా పైథాన్ లాంగ్వేజ్ గొప్పదా అనడిగితే ఏంచెప్తారు,  ఏది వ్రాసేవాళ్ళు అదిగొప్పదంటారు, అదే సహజం కానీ దేని గొప్ప దానిదే, దేని ఉపయోగం దానిదే.

విమర్శ గురించి వ్రాస్తూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లో కోడ్ రివ్యూలలో పాటిస్తున్నారు. అదే, వ్రాసినదాంట్లో తప్పులని విమర్శించాలి కానీ వ్రాసినవాడిని విమర్శించకూడదని. ప్రామాణికమైన మాట (ఈ మాట సరైనదేనా?). 

అష్టావధానాలని తీసిపారేయడం నాకునచ్చలేదు, నాకవంటే ఇష్టంగాబట్టి. ఇదిచెప్తూ, ఇవి సామాన్య ప్రజలని ఆకట్టుకుంటాయి కానీ గొప్పవికావన్నారు. కానీ జనరంజకంకాని కళకు సార్ధకం ఏమిటి?

వాట్సాప్ లో తిరుగుతున్న శ్రీ పిడపర్తి దక్షిణామూర్తి గారి కోర్టు సీను ఇందులోదే. మరి ఆరోజుల్లో (గొల్లపూడి మారుతీ రావు గారు అనే వరుసలో అనుకోండి :)) అలాంటి గొప్పవారు ఉండేవారేమో. ఎప్పుడైతే విద్య వాణిజ్యమైపోతుందో అప్పుడే దాని శక్తి, విలువ తగ్గిపోతాయనుకుంటా.

ఈయనకీ కాంగ్రెస్ అంటే పడదనుకుంటా :)

 ఈయన వ్రాసిన పుస్తకాలేవీ ఇంతకుముందు చదవలేదు, దొరికితే కొని చదవాలి.

నాఅభిప్రాయాలు ఎవరినీ కించపరచడానికికావని తెలియచేసుకుంటూ, ఏమైనా తప్పులుంటే మన్నించేయండి 🙏

~సూర్యుడు 😷 :-)

Saturday, December 7, 2019

మీరు రేడియో ప్రియులా ...

టెలివిషన్ అందుబాటులోలేని రోజుల్లో రేడియో చాలా ముఖ్యమైన ప్రసార సాధనం. అంతేకాదు కొన్ని తరాలు రేడియో (ఆకాశవాణి) సమయాలు / కార్యక్రమాలు ప్రకారముగా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు జరుపుకొనేవారంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు రేడియో అంటే FM రేడియోనే. పల్లెల్లోనే రేడియోలు పోయి TVలు వచ్చేశాయి. అయితే ఈమధ్యకాలంలో TV ప్రసారాలు (సరే నేనీమధ్య దూరదర్శన్ చూడలేదు) చూసినట్లయితే చాలా చిరాగ్గా ఉంటున్నాయి. వార్తా ఛానెల్స్ గురించి చెప్పనక్కర్లేదు, ఓ పదిమందిని పిలిచి కొట్లాటపెట్టి జనాలకు మనోరంజనాన్ని చేకూరుస్తుంటారు.

మరి వేరే ఏమైనా ప్రత్యామ్నాయమేమైనా ఉందా అంటే, ఏమో మళ్ళీ పాత ఆకాశవాణి ఉపయోగపడుతుందేమో చూడాలి. ప్రసార భారతి వాళ్ళు న్యూస్ ఆన్ ఎయిర్ అని ఒక మొబైల్ app విడుదల చేశారు. మీరుకూడా ఆకాశవాణి ప్రియులైతే ఈ యాప్ ని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని మీకు నచ్చిన ఆకాశవాణి కేంద్రంనుండి ప్రాసరమయ్యే కార్యక్రమాలు విని ఆనందించండి.

http://prasarbharati.gov.in/AIR/

https://play.google.com/store/apps/details?id=com.parsarbharti.airnews

ఏకాంబరాలు, పెద్దన్నలు, చిన్నక్కలు లేకపోయినా ఆకాశవాణి ప్రసారాలు ఇంకా అంతే ఆసక్తికరంగా ఉంటాయని / ఉండాలని కోరుకుంటూ ...

~సూర్యుడు :-)

Sunday, June 23, 2013

ఈటి విద్య

ఈటి విద్య అంటే ఏంటో తెలుసా?

Sunday, December 12, 2010

Communication - ?

ఇప్పుడందరూ కమ్మ్యూనికేషన్, కమ్మ్యూనికేషన్ (టెక్నాలజీ కాదు) అంటున్నారు కదా, అసలు ఈ కమ్మ్యూనికేషన్ని తెలుగులో ఏమని అనాలో?

Monday, April 5, 2010

నేను చదివిన / చూసిన పాత తెలుగు నవలలు

మళ్లీ నేను మర్చిపోకుండా :)

  1. మట్టి బొమ్మలు (తాడిగిరి పోతరాజు)
  2. వైకుంఠపాళి (ద్వివేదుల విశాలాక్షి)
  3. గ్రహణం విడిచింది (ద్వివేదుల విశాలాక్షి)
  4. నానృషిః కురుతే కావ్యం (సి ఆనందరామం)
  5. సంపెంగలూ సన్నజాజులు (అవసరాల రామకృష్ణారావు)
  6. శాంతినికేతన్ (కోడూరి కౌసల్యాదేవి)
  7. విజేత (యుద్ధనపూడి సులోచనారాణి)
  8. ఇడియట్ (కొమ్మూరి వేణుగోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ)
  9. మాయావి (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
  10. మాయావిని (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
  11. రత్నదీపం (సగం సగం) (బెంగాలీ మూలం: ప్రభాత్కుమార్ ముఖోపాధ్యాయ్)
  12. పూర్వా సంధ్యా ప్రవర్తతే (?)
  13. పుణ్యభూమీ కళ్లుతెరు (బీనాదేవి)
  14. ఇంద్రధనుస్సు (?)
  15. విధి విధానం (?)
  16. చదరంగం (?)
  17. స్త్రీ (ముప్పాళ్ల రంగనాయకమ్మ)
  18. పసిడి హృదయాలు (?)
  19. నాతి చరామి (?)
  20. మ్రోగింది వీణ (అనుమానం) (?)
  21. గుడి గంటలు (అనుమానం) (?)
  22. కన్యాశుల్కం (నాటకం) (గురజాడ అప్పారావు)
  23. వరవిక్రయం (నాటకం) (కాళ్లకూరి నారాయణరావు)
  24. వేయిపడగలు (విశ్వనాథ సత్యన్నారాయణ)
  25. రాజశేఖర చరిత్ర (కందుకూరి వీరేశలింగం)
  26. సమాంతర రేఖలు (పసుపులేటి మల్లికార్జున రావు)
  27. ఎండమావులు (దూర్వాసుల కామేశ్వరి)
  28. చక్రవాకం (కోడూరి కౌసల్యాదేవి)
  29. కెప్టెన్ కథ (బీనాదేవి)
నాకు గుర్తున్నంత వరకు రచయితల పేర్లు ఇచ్చాను. మీకెవరికైనా మిగిలినవాటి రచయితల పేర్లు తెలిస్తే తెలియచేయండి. మా ఇంట్లో ఈ పుస్తకాలన్నీ ఒకప్పుడుండేవి, ఇప్పుడు లేవు, కనీసం పేర్లైనా వ్రాసుంచుకుంటే అని ...

ఇంకా చాలా ఉండాలి, గుర్తొచ్చినప్పుడు వాటిని కూడ జతచేస్తాను.

~సూర్యుడు :-)