Friday, December 31, 2021

ఒక పరిశీలన



నిన్నో మొన్నో ఇంట్లో ఎవరో టివి ఛానెల్స్ మారుస్తూ సాక్షి దగ్గర ఆగారు. ఏదో చర్చ నడుస్తోంది. యాంకర్ కాక ఇంకో ముగ్గురు కనిపిస్తున్నారు. ఒకరు పాత్రికేయుడు, ఒకరు YSRCP, ఇంకొకరు BJP. వీళ్ళు కాకుండా ఇంకొంతమంది ఫోన్లో ఉన్నట్టున్నారు. చర్చ వస్తువు మద్యపానానికి సంబంధించినది.

నేనీమధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అంత నిశితంగా పరిశీలించకపోవడంవల్ల ఇక్కడేమిజరుగుతోందో అంతగా అవగాహనలేదు. కాకపొతే, ఈ చర్చ కొద్దిసేపు విన్నతర్వాత నాకనిపించిన అభిప్రాయాలు ఇక్కడ:




ముందస్తు గమనిక:- నేనిక్కడున్న ఏ రాజకీయపక్షానికి మద్దతుదారునికాదు.




సోము వీర్రాజు అనేఆయన మద్యాన్ని INR 50 లకే విక్రయిస్తామని హామీ ఇచ్చినట్లున్నారు. దీనిమీద KTR ఏమన్నారు, దానికి BJP సమాధానమేమిటని ప్రశ్న. ఇది ప్రక్కన పెడితే, ఏ ఏ రాష్ట్రాల్లో మద్యం విక్రయంమీద ఎంత రాబడి వస్తోందో వివరించి, ఉత్తరప్రదేశ్ లో 30 కోట్ల ఆదాయం వస్తోంది కాబట్టి అక్కడ ప్రభుత్వం ప్రజలదగ్గరనుంది ఎక్కువగా దోచేస్తోందని దానికి బీజేపీ సమాధానమేమిటని ప్రశ్న. BJP తరపున మాట్లాడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వరకే మాట్లాడాలి అని ఈ ప్రశ్నని దాటవేసేశారు ప్రతిసారి. YSRCP తరపున మాట్లాడినాయన తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలతో పోలిస్తే మద్యం మీద మన రాష్ట్ర ఆదాయం తక్కువేనని వాదించారు. అది వింటున్నప్పుడు నాక్కూడా అనిపించింది BJP వాదనలో పట్టులేదని.



కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించిందేమంటే, ఈ రాష్ట్రాల జనాభా సంఖ్య వేరే. జనాభా ప్రాతిపదికన చూస్తే ఆంధ్రప్రదేశ్ జనాభా (2021 లో) 5.46 కోట్లు, మద్యం మీద ఆదాయం 2021 లో 14,375. కోట్లు. తమిళనాడు జనాభా (2021 లో) 7.88 కోట్లు, మద్యం మీద ఆదాయం, 33,811.4 కోట్లు. కర్ణాటక జనాభా 6.84 కోట్లు, మద్యం మీద ఆదాయం 22,851 కోట్లు (2020-2021 లో). మహారాష్ట్రలో జనాభా 12.47 కోట్లు, మద్యం మీద ఆదాయం 15,090 కోట్లు (2020-2021 లో). ఉత్తరప్రదేశ్ జనాభా 24.1 కోట్లు, మద్యం మీద ఆదాయం 36000 కోట్లు. ఈ లెక్కన చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా తమిళనాడు , కర్ణాటక ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రజలు తక్కువగా మద్యం సేవిస్తున్నారు. కేరళ జనాభా 3.58 కోట్లు, మద్యం మీద ఆదాయం, 10,379.38 కోట్లు. ఇవన్నీ గూగుల్ లెక్కలు కాబట్టి కొంతవరకు కాకి లెక్కే అయ్యుంటుంది.



ఒకరకంగా మద్యం నిత్యావసర వస్తువుకింద వచ్చినట్లుగా అనిపించింది. ఇదీ మన పురోగతి.



ప్రజలని ఏదో ఒక మత్తులో ఉంచాలి, అది మద్యం కావచ్చు మతం కావచ్చు :)



~సూర్యుడు :-)

Wednesday, December 22, 2021

మూడు నవలలు

ఈ మధ్య ఓ మూడు నవలలు చదివాను. అవి Billy Summers by Stephen King, The Judge's List by John Grisham and Damascus Station by David McCloskey. మూడు నవలలు బాగున్నాయి, అదే వరుస క్రమంలో. 

 

Billy Summers ఒక sniper కథ. నేనింతకుమునుపెప్పుడు Stephen King నవలలు చదవలేదు, ఇదే మొదటిది. అంత గొప్పగా లేనప్పటికీ పరవాలేదు. 

 

The Judge's List ఒక న్యాయమూర్తి కథ. తనకు జరిగిన (perceived) అవమానాలకు, మోసాలకు ప్రతీకారంగా ఒక చిట్టా తయారు చేసి వాళ్ళందరిని ఎవరికీ దొరక్కుండా ఎలా చంపాడో వివరించే కథ. ఉత్కంతంగా ఉండి బాగుంది. 


Damascus Station is the best, love story, err, spy story or a Spy's Love Story 😀. వేళాకోళాల్ని ప్రక్కనపెడితే, నవల చాలా బాగుంది. సిరియా upraising నేపథ్యంలో జరిగిన కథ. స్పై నవలలు ఇష్టపడేవారు తప్పకుండ చావాల్సిన నవల. నవలా రచయిత David McCloskey CIA లో  పనిచేసి ఉండడం వల్ల నవలకు కొంత సాధికారత వచ్చిందనిపించింది. వ్రాసిన విధానం కూడా చాలా బాగుంది. 

 

ప్రస్తుతానికి Douglas London వ్రాసిన The Recruiter చదువుతున్నాను. ఇది నవల కాదు. ఒకరకంగా ఒక CIA మాజీ ఉద్యోగస్తుని ఆత్మకథలాంటిది. సాధారణంగా నాకు ఆత్మకథలు అంతగా నచ్చవు కానీ ఇందులో కొన్ని నిజంగా జరిగిన సంఘటనల్ని వివరించడంవల్ల ఇప్పటివరకు బాగానే ఉంది. 

 

కోవిద్-19 ఓమిక్రాన్  వైరస్ విపరీతంగా వ్యాపించే అవకాశాలుండడంవల్ల మామూలు మాములుగా కోవిద్-19 జాగ్రత్తలు అన్ని పాటించి ఆరోగ్యంగ ఉంటారని ఆశిస్తూ ... 


~సూర్యుడు 😷

Sunday, September 12, 2021

ది చెలస్ట్ (The Cellist)

చాలా రోజుల తర్వాత మళ్ళీ గాబ్రియల్ అలన్ నవల ది చెలస్ట్  (The Cellist) చదివాను. ఇంతకు ముందు Daniel Silva నవలల్లాగే ఇదికూడా బాగుంది. ఒక రష్యన్ సంపన్నుడు ఇంగ్లాండ్ లో హత్యకు గురికావడంతో మొదలవుతుంది ఈ నవల. ఈ రష్యన్ గాబ్రియల్ అలన్ కు స్నేహితుడు కావడంతో ఆ హత్యకు కారణమైన వాళ్ళపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే ఈ నవల.

చివర్లో, అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు, వాటి ఫలితాలు, ఆ తర్వాత జరిగిన గొడవలు, రచయిత యొక్క రాజకీయ అభిప్రాయాలు ప్రస్తావించబడ్డాయి. ఇంతకుముందునుండి అనుకుంటున్నదే కానీ ఇది చదివిన తర్వాత మళ్ళీ అనిపించిందేమంటే, ప్రజలను ఎక్కువగా పోలరైజ్ (దీనికి తెలుగులో ఏ పదం వాడాలి?) చేసేయ్యకూడదు. ఇది మితిమీరితే ఒకే దేశంలో రెండు దేశాలు ఉన్నట్లుంటుంది. రాజకీయ పక్షాలకు, వాటి నాయకులకు పరిణతి లేకపోతే వచ్చే చిక్కే ఇది. ఇంతకు ముందు మనదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఓ రెండు చాలవా అనిపించింది కానీ బాగా ఆలోచిస్తే ఎక్కువ ఉండడమే మంచిదనిపిస్తోంది. 

ఈ నవల తర్వాత ఎప్పటినుండో ఆగిపోయిన టైఫూన్ నవల పూర్తిచేసేసాను. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా తర్వాత తర్వాత చాలా బాగుంది. చార్లెస్ కమ్మింగ్ నవలల్లో ఇదే బెస్టేమో. హాంగ్ కాంగ్ ను బ్రిటిష్ రూలింగ్ నుండి చైనా కు అప్పచెప్పే సమయంలో జరిగిన కథ ఇది. నాకు చాలా నచ్చింది. 

ఇంతకుమునుపెప్పుడు Stephen King నవలలు చదవలేదు కానీ ఈమధ్యనే Billy Summers కొన్నాను. చదవాలి, ఎలా ఉంటుందో ... 


~సూర్యుడు :-)

Friday, June 25, 2021

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ - జ్ఞాపకాలూను

ఆమధ్య ఎప్పుడో వాట్సాప్ లో తెలుగు పుస్తకాల లింకులు వచ్చాయి. అందులో ఒకటి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి  గారి  అనుభవాలూ - జ్ఞాపకాలూను. అప్పుడే డౌన్లోడ్ చేసినా ఇప్పటివరకు చదవడానికి కుదర్లేదు. ఈ మధ్యనే మళ్ళీ కనిపిస్తే చదవాలనిపించి చదివాను. ఇలాంటి పుస్తకాలు చదివానని చెప్పుకోవడమే తప్పిస్తే అవి ఎలా ఉన్నాయో చెప్పగలిగే అర్హతలు లేకపోవడంవల్ల నాకేమనిపించిందో గుర్తున్నవి వ్రాస్తాను. 

 మొదటిగా ఆయన ఆర్థికపరిస్థితి, అదీ చివరిదశలో ఎలా ఉండిందో తెలుసుకొని చాలా బాధ అనిపించింది. కళాకారులకేదో శాపం ఉండుంటుంది. ఎవరో కొద్దిమందిని  మినహాయిస్తే చాలావరకు కళాకారుల ఆర్థికపరిస్థితి ఇంతేనేమో. 

 వ్రాసిన తెలుగు భాష సరళంగా ఉంది,  గ్రాంధికం కాకుండా. ఆయన విద్యాభ్యాసం అప్పటి పరిస్థితులగురించి చాలా వివరంగా వ్రాసారు. ఇప్పటివాళ్లకి తెలుసుకోవడానికి బాగుంటాయి. పాతకవుల గురించి ప్రస్తావించారు కానీ అందులో పోతన లేకపోవడం నాకెందుకో నచ్చలేదు.

ఆయన సంస్కృతంలో చదువుకుని తెలుగులో వ్రాయడంవల్ల ఏది గొప్పదో లేక ముఖ్యమో అన్నవిషయంలో ఆయన ఇచ్చిన వివరణ నాకు సరిగ్గా అర్ధంకాలేదు. అలాగే పద్యం వ్రాసినవాడే కవా లేక వచనం వ్రాసినవాడు కూడా కవేనా అన్న విషయంలో చాలా వివరణ ఇచ్చారు కానీ నాక్కూడా పద్యం వ్రాసినవాడే కవని ఘాట్టి నమ్మకం :).  అసెంబ్లీ లాంగ్వేజ్ (శ్లేషనింటెండెడ్) గొప్పదా పైథాన్ లాంగ్వేజ్ గొప్పదా అనడిగితే ఏంచెప్తారు,  ఏది వ్రాసేవాళ్ళు అదిగొప్పదంటారు, అదే సహజం కానీ దేని గొప్ప దానిదే, దేని ఉపయోగం దానిదే.

విమర్శ గురించి వ్రాస్తూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లో కోడ్ రివ్యూలలో పాటిస్తున్నారు. అదే, వ్రాసినదాంట్లో తప్పులని విమర్శించాలి కానీ వ్రాసినవాడిని విమర్శించకూడదని. ప్రామాణికమైన మాట (ఈ మాట సరైనదేనా?). 

అష్టావధానాలని తీసిపారేయడం నాకునచ్చలేదు, నాకవంటే ఇష్టంగాబట్టి. ఇదిచెప్తూ, ఇవి సామాన్య ప్రజలని ఆకట్టుకుంటాయి కానీ గొప్పవికావన్నారు. కానీ జనరంజకంకాని కళకు సార్ధకం ఏమిటి?

వాట్సాప్ లో తిరుగుతున్న శ్రీ పిడపర్తి దక్షిణామూర్తి గారి కోర్టు సీను ఇందులోదే. మరి ఆరోజుల్లో (గొల్లపూడి మారుతీ రావు గారు అనే వరుసలో అనుకోండి :)) అలాంటి గొప్పవారు ఉండేవారేమో. ఎప్పుడైతే విద్య వాణిజ్యమైపోతుందో అప్పుడే దాని శక్తి, విలువ తగ్గిపోతాయనుకుంటా.

ఈయనకీ కాంగ్రెస్ అంటే పడదనుకుంటా :)

 ఈయన వ్రాసిన పుస్తకాలేవీ ఇంతకుముందు చదవలేదు, దొరికితే కొని చదవాలి.

నాఅభిప్రాయాలు ఎవరినీ కించపరచడానికికావని తెలియచేసుకుంటూ, ఏమైనా తప్పులుంటే మన్నించేయండి 🙏

~సూర్యుడు 😷 :-)

Saturday, June 5, 2021

కోవిడ్ లెక్కలు

 కోవిడ్ లెక్కలు అంటే వేద గణితం, పాశ్చాత్య గణితమో లాంటిది కాదుకాని  కోవిడ్ మహమ్మారి వల్ల జరుగుతున్నా లేదా చేస్తున్న పనులవల్ల జరిగే జమా ఖర్చుల వివరాలు, సాంఖ్యక విలువలు, సంభావ్యతలు ఎలాఉన్నాయన్నది చూద్దామని ... 

 

ఇప్పుడు కోవిడ్ టీకాల ధరలు మారిపోతున్నాయి కాబట్టి సరాసరిని ఒకటీకాకు ఐదువందల రూపాయలనుకుంటే కనీసం ఓ యాభై కోట్లమంది టీకా తీసుకునేటట్లయితే ఎంత ఖర్చవుతుంది? ఇరవైఐదువేల కోట్లు, అదే రెండుసార్లు తీసుకోవాలంటే యాభైవేల కోట్లు. అసలు కోవిడ్ వచ్చిందోలేదో తెలుసుకోవడానికి చేసే పరీక్షకు సరాసరిని ఓ ఐదువందలనుకుంటే దేశంలో సగంమందికి (అంటే ఓ అరవైఐదు కోట్లనుకోవచ్చా?) పరీక్షలు చేస్తే అయ్యే ఖర్చు ముప్పైరెండువేల ఐదువందల కోట్లు. మరి తుమ్మినప్పుడల్లా ఈ పరీక్ష చేయించుకోమంటున్నారు కాబట్టి కనీసం రెండుసార్లు చేయించుకున్నా అరవైఐదువేల కోట్లు. అంటే పరీక్షలకు టీకాలకే లక్షాపదిహేనువేల కోట్లు. సరే ఇంక ఆసుపత్రులలో చేరినవారికి ఎంతెంత ఖర్చవుతోంది, మందులకెంత ఖర్చవుతోంది, ముక్కు మూతి కప్పుకోవడానికి, చేతులు కడగడానికి ఎంత ఖర్చవుతోందో చూస్తే తల తిరిగేలా ఉంది. 

 ఇదంతా ప్రజలనుంచి వెళ్ళిపోతున్న ధనమేకదా?

 

 ఈ మహమ్మారి ప్రభావంవల్ల పట్నాల్లో దైనందిక జీవితం స్థంభిస్తే ఉద్యోగాలు పోయినవాళ్ళెంతమంది, వ్యాపారాలు లేక నష్టపోయినవారెంతమంది? ఇది మనం లెక్కవేయలేముకదా. అంటే రావలసిన ఆదాయం రావటంలేదు కానీ ఖర్చుమాత్రం పెరిగిపోయింది. దీనిప్రభావం మధ్యతరగతిమీదెంత? మొత్తంమీద నష్టమెంత?

 

ఇక ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది కోలుకుంటున్నారు, ఎంతమంది ఆసుపత్రులకెళ్తున్నారు, ఎంతమంది ప్రాణాలుకోల్పోతున్నారు, ఇవన్నీ కాకిలెక్కలే, కదా? ఇప్పుడు ఈరెండో కెరటం పల్లెలక్కూడా పాకడంతో, ఎంతమంది పరీక్షలు చేయించుకుంటున్నారు, ఎంతమంది వైద్యం చేయించుకుంటున్నారు ఎవరికి తెలుసు. 


ఇక ఇలా ఎన్ని కెరటాలొస్తాయి, ఇవన్నీ ముగిసేసరికి ఎంతమంది మిగులుతారో ఎవరికీ తెలీదు. మిగిలినవాళ్ళకి తీసుకున్న మందులవల్ల ఇంకేమైనా వ్యాధులు వస్తాయా, వాటి పర్యవసానమేమిటి అన్నది అసలు తెలీదు. 


ఈ  మహమ్మారి వాళ్ళ ఎవరెవరికి ఎంత నష్టమో అర్ధమైంది మరి లాభమెవరికైనా ఉంటుందా? ఉంటే ఎవరికి?


~ సూర్యుడు 😷

Sunday, May 23, 2021

ఊరికే ఊసుపోక ...

ఈమధ్య బ్లాగుకొచ్చి చాలా రోజులైపోయింది. ఇంట్లోంచి పనంటే మొదట్లో బాగానే ఉన్నా, పని సమయానికి కుటుంబ సమయానికి మధ్య తేడా చెరిగిపోయి ఎంతసేపు కంప్యూటర్ ముందు కూచుంటుంటే ఇంకేమైనా చెయ్యడానికి సమయమెక్కడుంటుంది, కదా?


సరే ఎంత తీరికలేకున్నా మనకి నచ్చిన పనులు చెయ్యడానికి సమయమెప్పుడూ ఉండనేవుంటుంది 😁


నచ్చినపనంటే ఇంకేముంటుంది పుస్తకాలు చదవడం తప్ప. పుస్తకాలు కొనడమైతే ఎక్కువే కొనుక్కున్నాను కానీ అన్ని చదవడం కుదర్లేదు. ఇది మామూలే కదా. మళ్ళీ David Baldacci నవలలు, A Minute To Midnight తర్వాత Walk the wire చదివాను. ఈ రెండు నవలలు బాగున్నాయి. అమెరికా లో కూడా అందరూ గొప్పవాళ్లే కాదు పేదలు కూడా ఉంటారని, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో కొద్దిగా తెలుస్తుంది.


ఈమధ్య Joseph Kanon నవలలు కొన్ని కొన్నాను. The Accomplice తర్వాత The Prodigal Spy నవలలు చదివాను. మొదటిది ఓమాదిరిగా ఉంది. The Prodigal Spy నవల నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు The Alibi, Stardust తర్వాత The Good German నవలలు చదువుదామని మొదలుపెట్టాను కానీ ఏదీ ముందుకు వెళ్లడంలేదు. అలాగే Jo Nesbo నవల The Kingdom కొని మొదలుపెట్టాను కానీ అదికూడా ముందుకి కదలడంలేదు. 

 

ప్రస్తుతానికి నవలలు చదవడం ఆపేసి రెండో కెరటం భారతదేశాన్ని ఎలా ముంచేస్తోందో చూడ్డంలో మునిగిపోయాను. ఏదేమైనా ప్రజలు ప్రభుత్వాలూ అశ్రద్ధచేసి తలమీదకి తెచ్చుకున్న వ్యవహారమిది. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించి, ప్రభుత్వాలు ముందుగా మేలుకునివుంటే ఇంత ఉత్పాతము సంభవించేదికాదు కదా. సరే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మనకి కొత్తేమీకాదు.

 

https://www.thehindu.com/news/national/coronavirus-negative-covid-report-isnt-the-end-of-problem-warn-doctors/article34621913.ece?homepage=true


ఈమధ్య ఈక్రింద వ్యాసాన్ని చదివాను. అందులోంచి నాకు నచ్చిన ఓ పంక్తి ... 

https://www.ndtv.com/opinion/opinion-why-modi-shah-hyped-bengal-so-much-by-yashwant-sinha-2426394


Separately, the Congress has been a major loser in these elections. The Left has at least won Kerala and created history by being the first government in 40 years to be re-elected. There was some hope for the Congress in Assam but it failed there also. The time for serious introspection for the Congress party is now. It cannot postpone it forever. If a non-Gandhi has to lead the Congress party, then so be it, otherwise we may soon see a 'Congress-mukt Bharat'. That will be tragic indeed. The Congress party must live, if not for itself, then at least for the country.

 

నాక్కూడా అనిపిస్తుంది, కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక ఆలోచన, అదెప్పటికీ కనుమరుగవ్వదు, ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్య్రాలమీద  నమ్మకమున్నంతవరకు ... 

 

సరే ఎవరింటి కాపలా కుక్కలు వాళ్లకి, ఎవరి డబ్బాలు వాళ్లకి ఉంటాయనుకోండి 😃

 

~ సూర్యుడు :-)